రాహుల్, సుదర్శన్ అదరహో.. చేజింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన భారత్ ‘ఏ’

by Harish |

ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఏ’ టీమ్ అద్భుత విజయం సాధించింది.

రాహుల్, సుదర్శన్ అదరహో.. చేజింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన భారత్ ‘ఏ’
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఏ’ టీమ్ అద్భుత విజయం సాధించింది. అసలు గెలుపు ఆశలే లేని స్థితి నుంచి గొప్పగా పుంజుకుని 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో412 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లే కోల్పోయి ఛేదించగా.. భారత్ ‘ఏ’ రికార్డ్ చేజింగ్‌ను నమోదు చేసింది. కేఎల్ రాహుల్(176 నాటౌట్), సాయి సుదర్శన్(100) సంచలన ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రెండు టెస్టుల సిరీస్‌ను ఇండియా ‘ఏ’ 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే.

లక్నోలో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు ప్రత్యర్థిదే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 420 పరుగుల భారీ స్కోరు చేయడమే కాక భారత్‌ను 194 రన్స్‌కే ఆలౌట్ చేసి 226 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. దీంతో ఇండియా ‘ఏ’ జట్టు గెలుస్తుందన్న అంచనాలు లేవు. ఆ స్థితిలో మూడో రోజైన గురువారం సమిష్టిగా రాణించిన బౌలర్లు ప్రత్యర్థిని 185 పరుగులకే కూల్చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయినప్పటికీ ఆసిస్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్ లీడ్(226) కలుపుకుని 412 పరుగుల భారీ లక్ష్యమే నిర్దేశించింది.

మూడో రోజే చేజింగ్‌ను ఆరంభించిన ఇండియా ‘ఏ’.. రాహుల్ రాణించడంతో గురువారం ఆట ముగిసే సమయానికి 169/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. అప్పటికీ భారత్ విజయానికి 243 పరుగుల దూరంలో ఉంది. ఇక, ఆటలో చివరి రోజైన శుక్రవారం కూడా రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 210 బంతుల్లో 176 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికితోడు సాయి సుదర్శన్ కూడా అదరగొట్టాడు. కెప్టెన్ ధ్రువ్ జురెల్(56) కూడా సత్తాచాటాడు. సుదర్శన్, జురెల్‌తో కలిసి రాహుల్ జట్టును విజయం దిశగా నడిపించగా.. భారత్ 5 వికెట్లు కోల్పోయి 413 రన్స్ చేసి విజయతీరాలకు చేరింది.


Next Story