చెలరేగిన రాధ, యాస్తికా.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్ ‘ఏ’ జట్టు

by Harish |

చెలరేగిన రాధ, యాస్తికా.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్ ‘ఏ’ జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఏ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ఏ జట్టు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఆ దిశగానే వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేసింది. 47.5 ఓవర్లలో ఆసిస్ 214 పరుగులే చేసి ఆలౌటైంది. అనిక లిరోయిడ్(92 నాటౌట్), రాచెల్ ట్రెనామన్(51) రాణించడంతో ఆ స్కోరైనా చేయగలిగింది. లేదంటే ఆ జట్టు ఇంకా తక్కువ స్కోరేకే పరిమితమయ్యేది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. రాధ యాదవ్ 3 వికెట్లు, టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీసి ఆసిస్ పతనాన్ని శాసించారు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏ 42 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యాస్తికా భాటియా(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. షెఫాలీ వర్మ(36), ధర గుజ్జార్(31), రఘ్వి బెస్ట్(25 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ ఏ వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం రెండో వన్డే జరగనుంది.


Next Story