సింధు పేలవ ఫామ్.. మరో టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఔట్

by Harish |

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

సింధు పేలవ ఫామ్.. మరో టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ టోర్నీలో ఆమె తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 15-21, 14-21 తేడాతో సౌత్ కొరియాకు చెందిన సిమ్ యు జెన్ చేతిలో పరాజయం పాలైంది. రెండు గేముల్లోనూ సిమ్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే, సింధుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి గేములో ముందుగా 3-9తో వెనుకబడిన సింధు ఆ తర్వాత 12-13తో పోటీలోకి వచ్చింది. కానీ, అదే పోరాటాన్ని కొనసాగించడంలో విఫలమైంది. ఇక, రెండో గేములో 7-7, 11-11తో ప్రత్యర్థికి పోటీనిచ్చినా ఆ తర్వాత తేలిపోయింది. సిమ్‌తో సింధు మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఓడటం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరిలో ఇండియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. మరో నాలుగు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. యువ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ తొలి రౌండ్‌లో 21-15, 18-21, 21-18 తేడాతో మరో భారత షట్లర్ రక్షిత శ్రీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది.

లక్ష్యసేన్, సాత్విక్ జోడీ శుభారంభం

మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో చైనా షట్లర్ వాంగ్ జెంగ్ జింగ్‌ను 11-21, 18-21తో చిత్తు చేశాడు. రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ జపాన్ ప్లేయర్ కొడై నారోకాతో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్ జంట 21-18, 21-10 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మింగ్ హ్యుక్-కి డాంగ్ జు ద్వయంపై గెలిచింది.


Next Story