అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు.. BWF కౌన్సిల్లో కీలక పదవి

by Naga Rani Yarlagadda |

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు క్రీడారంగంలో మరో కీలక బాధ్యతను చేపట్టారు.

అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు.. BWF కౌన్సిల్లో కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు క్రీడారంగంలో మరో కీలక బాధ్యతను చేపట్టారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె, ఇప్పుడు BWF కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2025 చివరిలో అధికారిక ప్రక్రియను పూర్తి చేసుకున్న సింధు.. డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మొదటిసారి కౌన్సిల్ సభ్యురాలిగా హాజరయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో సింధు చేరడం వల్ల క్రీడాకారుల సమస్యలకు ప్రాధాన్యత లభించనుంది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ప్రైజ్ మనీ కేటాయించడం, అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఉన్న టోర్నమెంట్ల ఒత్తిడిని తగ్గించడం వంటి సంస్కరణల కోసం ఆమె కృషి చేసే అవకాశం ఉంది. నిరంతర టోర్నమెంట్ల వల్ల ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న తరుణంలో, సింధు ప్రాతినిధ్యం క్రీడాకారుల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చురుగ్గా ఆడుతున్న క్రీడాకారిణిగా ఉంటూనే, గ్లోబల్ గవర్నెన్స్ స్ట్రక్చర్‌లో ఓటింగ్ హక్కును పొందడం ఒక విశేషం. ఈ బాధ్యతపై సింధు స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుల గళాన్ని వినిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి తోడ్పడటం పట్ల ఆమె కృతజ్ఞత వ్యక్తం చేశారు. BWF అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా లీస్వద్త్రాకుల్ సింధును సాదరంగా ఆహ్వానించారు. సింధు వంటి గొప్ప రోల్ మోడల్ కౌన్సిల్‌లో ఉండటం వల్ల అథ్లెట్ల గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో సింధు అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు సభ్యులు విశ్వసిస్తున్నారు.

Next Story