- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSG ఛాంపియన్స్ లీగ్ విజయం: పారిస్‌లో హింసాత్మకంగా మారిన సంబరాలు..
యూఈఎఫ్ఏ ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (పీఎస్‌జీ) ఘన విజయం సాధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూఈఎఫ్ఏ (UEFA) ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో (Paris Saint-Germain) పారిస్ సెయింట్-జర్మైన్ (పీఎస్‌జీ) ఘన విజయం సాధించింది. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా ఆర్సెనల్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా గెలుపొందిన పీఎస్‌జీ.. తమ రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈ గెలుపు సంబరాలు పారిస్ నగర వీధుల్లో హింసాత్మకంగా మారాయి. అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఫ్రాన్స్ వ్యాప్తంగా 416 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అదుపు తప్పిన వేడుకలు..
అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. మ్యాచ్ ముగిసిన వెంటనే వేలాది మంది అభిమానులు ఆర్క్ డీ ట్రయంఫ్, షాంప్స్-ఎలిసీస్ తదితర ప్రధాన వీధుల్లోకి చేరుకుని బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కొద్దిసేపటికే ఈ వేడుకలు అదుపు తప్పాయి. పలువురు ఆకతాయిలు కార్లకు నిప్పుపెట్టడంతో పాటు, దుకాణాలను ధ్వంసం చేశారు. సీన్ నది ఒడ్డున చెలరేగిన మంటల పొగకు ఐఫిల్ టవర్ సైతం కనిపించకుండా పోయింది. ఓ పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించిన అల్లరి మూకలను పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. పీఎస్‌జీ హోం గ్రౌండ్ పరిసరాల్లోనూ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ అల్లర్ల కారణంగా పారిస్‌లో ట్రామ్, మెట్రో, బస్సు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏడుగురు పోలీసులకు గాయాలు
ఈ హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా 416 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఒక్క పారిస్ పరిసరాల్లోనే 283 మంది అరెస్టయ్యారు. అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఏడుగురు పోలీసులు గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఫ్రాన్స్ వ్యాప్తంగా 22 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ ఈ స్థాయిలో అల్లర్లు జరగడం గమనార్హం. (గత ఏడాది పీఎస్‌జీ తొలి టైటిల్ గెలిచినప్పుడు జరిగిన అల్లర్లలో ఇద్దరు చనిపోగా, 500 మందికి పైగా అరెస్టయ్యారు).
నేడు భారీ విజయోత్సవ ర్యాలీ
ఆదివారం ఐఫిల్ టవర్ ఎదురుగా ఉన్న ఛాంప్ డి మార్స్‌లో పీఎస్‌జీ ఆటగాళ్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. దాదాపు 85 వేల నుంచి 90 వేల మంది అభిమానుల మధ్య ఆటగాళ్లు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని ప్రదర్శిస్తారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఎలిసీ ప్యాలెస్‌లో పీఎస్‌జీ ఆటగాళ్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వనున్నారు.






