PKL 2025 : వైజాగ్‌లో కబడ్డీ.. కబడ్డీ.. ఆగస్టు 29 నుంచి ప్రో కబడ్డీ లీగ్ షురూ

by Harish |

ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) ప్రతి ఏడాదిలాగే సందడి చేసేందుకు సిద్ధమవుతుంది.

PKL 2025 : వైజాగ్‌లో కబడ్డీ.. కబడ్డీ.. ఆగస్టు 29 నుంచి ప్రో కబడ్డీ లీగ్ షురూ
X

దిశ, స్పోర్ట్స్ : ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) ప్రతి ఏడాదిలాగే సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఆగస్టు 29 నుంచి 12వ సీజన్ మొదలుకానుంది. లీగ్ నిర్వాహకులు గురువారం షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సారి వైజాగ్‌లో పీకేఎల్‌కు తెరలేవనుంది. 7ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో పీకేఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. చివరిసారిగా 2018లో పీకేఎల్‌కు వైజాగ్ ఆతథ్యమిచ్చింది. 12 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభంకానుంది. ఆగస్టు 29న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్స్ మధ్య రెండో గేమ్ జరగనుంది.

డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ ఆగస్టు 31న తన తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఎదుర్కోనుంది. మొత్తం టోర్నీలో 108 లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు నాలుగు వేదికలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వైజాగ్, జైపూర్, చెన్నయ్, ఢిల్లీలను వేదికలుగా ఖరారు చేశారు. వైజాగ్‌లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు, జైపూర్‌లో సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు, చెన్నయ్ వేదికగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు, ఢిల్లీ వేదికగా అక్టోబర్ 13 నుంచి 23 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు, వేదికలు తర్వాత ప్రకటించనున్నారు.


Next Story