పృథ్వీ షా 'కొత్త ఇన్నింగ్స్'.. ఆకృతి అగర్వాల్‌తో స్టార్ క్రికెటర్ నిశ్చితార్థం

by Ramesh Naini |

టీమ్ ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా.. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు, నటి ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్నాడు.

పృథ్వీ షా కొత్త ఇన్నింగ్స్.. ఆకృతి అగర్వాల్‌తో స్టార్ క్రికెటర్ నిశ్చితార్థం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీమ్ ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తన జీవితంలో కీలకమైన 'సెకండ్ ఇన్నింగ్స్'కు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు, నటి ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులకు ఈ తీపి కబురు అందించాడు.

'ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్'

తన నిశ్చితార్థం గురించి పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు. మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితాంతం మైదానం వెలుపల కూడా అదే జోరు కొనసాగించేలా.. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్. ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్నాను’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్ అభిమానులు, తోటి క్రీడాకారులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎవరీ ఆకృతి అగర్వాల్?

22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియాలో పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆమె, ఉన్నత చదువుల కోసం ముంబైకి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. 'త్రిముఖ' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మూడు మిలియన్లకు పైగా (30 లక్షలు) ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ కలిసి చేసిన ఒక రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో కూడా ఈ జంట కలిసి సందడి చేయడంతో ఈ వార్తలు నిజమని తేలాయి.

అర్జున్ పెళ్లి జరిగిన వారం రోజులకే..

పృథ్వీ షా చిన్ననాటి స్నేహితుడైన అర్జున్ టెండూల్కర్ - సానియా వివాహం గత గురువారమే ఘనంగా జరిగింది. ఆ వేడుక ముగిసిన వారం తిరగకముందే పృథ్వీ తన ఎంగేజ్‌మెంట్ వార్తను ప్రకటించడం విశేషం.

Next Story