సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా

by Harish |   (  Updated:2025-07-07 15:24:27  IST  )

క్రమశిక్షణ లేమి, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా భారత యువ బ్యాటర్ పృథ్వీ షా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా
X

దిశ, స్పోర్ట్స్ : క్రమశిక్షణ లేమి, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా భారత యువ బ్యాటర్ పృథ్వీ షా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాకెట్‌లా దూసుకొచ్చిన ఈ 26 ఏళ్ల క్రికెటర్ అంతే వేగంతో పతనావస్థను చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌ను తిరిగి పునరుద్ధరించుకునే దిశగా పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీలో కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. ముంబై‌తో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నాడు.

ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ముంబైని వీడిన అతను వచ్చే దేశవాళీ సీజన్‌లో మహారాష్ట్ర ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతనికి నం.100 జెర్సీని కేటాయించినట్టు తెలిపింది. వచ్చే దేశవాళీ సీజన్‌లో మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో షా ఆడబోతున్నాడు. ప్రస్తుతం తాను మహారాష్ట్ర జట్టులో చేరడం తనకు ఉపయోగపడుతుందని షా తెలిపాడు. మహారాష్ట్ర తరపున ప్రతిభావంతులైన గైక్వాడ్, అంకిత్, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరిలతో ఆడే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.

కాగా, దేశవాలీలో షాకు మంచి రికార్డు ఉంది. 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4,556 రన్స్, 65 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 3,399 రన్స్, 117 టీ20ల్లో 2,902 పరుగులు చేశాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో షా చివరిసారిగా ముంబైకి ఆడాడు. పేలవమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణ లేమి కారణంగా ముంబై అతన్ని గతేడాది రంజీ జట్టు నుంచి తప్పించింది. గతేడాది ఐపీఎల్ మెగా వేలంలోనూ అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.

Next Story