- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FIFA World Cup: జర్మనీ ఫుట్‌బాల్ జట్టు క్యాంప్‌లో విషసర్పాల కలకలం!
ఫిఫా ప్రపంచ కప్ టోర్నీలో వ్యూహాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సిన జర్మనీ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిఫా ప్రపంచ కప్ టోర్నీలో వ్యూహాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సిన జర్మనీ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. నార్త్ కరోలినాలోని విన్‌స్టన్-సేలమ్‌లో ఏర్పాటు చేసిన తమ బేస్ క్యాంప్‌లోకి ఓ విషపూరిత పాము ప్రవేశించడంతో జర్మన్ ఆటగాళ్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. క్యాంప్‌లో కనిపించిన ఆ పామును నార్త్ కరోలినాలో సాధారణంగా కనిపించే అత్యంత ప్రమాదకరమైన ‘కాపర్ హెడ్’ (Copperhead) జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ పరిణామంపై జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ మాట్లాడుతూ.. ‘మామూలుగానైతే వ్యూహాలు, గాయాలు, తర్వాత ఆడే ప్రత్యర్థుల గురించే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ గడ్డిలో ఏం దాగుందోనని కూడా అడుగడుగునా భయపడాల్సి వస్తోంది. ఆ పాము విషపూరితమైనదని తెలిశాక మాలో ఆందోళన మరింత పెరిగింది. కాటుకు గురైతే ప్రాణాలు పోకపోవచ్చు కానీ పరిస్థితి విషమించి ఆసుపత్రిపాలు కావాల్సిందే’ అని పేర్కొన్నాడు.
ఇతర జట్లకూ ఇదే పరిస్థితి..
కేవలం జర్మనీకే కాకుండా స్విట్జర్లాండ్, నార్వే జట్లకు కూడా పాముల భయం పట్టుకుంది. స్విస్ జట్టు శాన్ డియాగోలోని తమ క్యాంప్ పరిసరాల్లో ఏకంగా ఒక ప్రాంతాన్ని ‘స్నేక్ ఏరియా’గా (పాములు తిరిగే ప్రదేశం) బోర్డులు పెట్టింది. నార్వే కెప్టెన్ క్రిస్టియన్ థోర్స్‌ట్వెడ్ట్ సైతం దీనిపై స్పందిస్తూ.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి సన్నద్ధమవుతున్న సమయంలో, మైదానంలో ప్రతి అడుగు కిందకు చూసుకుంటూ వేయాల్సి రావడం ఏమాత్రం సంతోషకరం కాదని అసహనం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, జర్మనీ జట్టు ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. పసికూన కురాకోపై 7-1 తేడాతో భారీ విజయం సాధించి శుభారంభం చేసిన జర్మన్ సేన.. జూన్ 21న జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌తో తలపడనుంది. పాముల భయాన్ని పక్కనపెట్టి ఆటపై ఏ మేరకు దృష్టి పెడతారో చూడాలని పలువురు అభిప్రాయ పడ్డారు.






