ఐపీఎల్-2026కు కమిన్స్ దూరం?.. కొత్త కెప్టెన్ అతనేనా?

by Harish |

ఐపీఎల్-2026కు కమిన్స్ దూరం?.. కొత్త కెప్టెన్ అతనేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొత్త కెప్టెన్‌ నడిపించబోతున్నాడా?.. ఇషాన్ కిషన్‌‌ను ఫ్రాంచైజీ సారథిగా నియమించబోతుందా?.. అని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ సీజన్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొనడంతో కెప్టెన్సీపై డిస్కషన్ మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ గతేడాది జూలై నుంచి వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. గత 8 నెలల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌కు కూడా అతను దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలుకాబోతుంది. అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అతనికి ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో కమిన్స్ భారత ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడంపై సందిగ్ధం నెలకొంది.

ఈ నేపథ్యంలో మరో ప్లేయర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ అందుకు సరైనోడని ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు సమాచారం. ట్రావిస్ హెడ్ గతంలో పలుమార్లు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అభిషేక్ శర్మ 2019 నుంచి జట్టులో ఉన్నాడు. కానీ, ఫ్రాంచైజీ వీరిద్దరిని కాకుండా ఇషాన్‌ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అతను ఇంతకుముందు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. కానీ దేశవాళీ‌లో అనుభవం ఉంది. జార్ఖండ్‌కు 79 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలోనే జార్ఖండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచింది. అలాగే, 2016‌లో అండర్-19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత అండర్-19 జట్టుకు సారథ్యం వహించాడు. కమిన్స్ గైర్హాజరైతే ఫ్రాంచైజీ ఇషాన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఎస్‌ఆర్‌హెచ్‌కు అతను 11వ కెప్టెన్ అవుతాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో ఇషాన్ సంచలన ప్రదర్శన చేశాడు. భారత్ టైటిల్ గెలవడంలో అతనిదీ కీలక పాత్రే. 9 మ్యాచ్‌ల్లో 317 రన్స్ చేశాడు.


Next Story