వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన తెలంగాణ అమ్మాయి దీప్తి.. 400 మీటర్ల రేసులో రజతం కైవసం

by Harish |

ఢిల్లీలో శనివారం ప్రారంభమైన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిష్‌ను భారత అథ్లెట్లు ఘనంగా మొదలుపెట్టారు.

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన తెలంగాణ అమ్మాయి దీప్తి.. 400 మీటర్ల రేసులో రజతం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో శనివారం ప్రారంభమైన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిష్‌ను భారత అథ్లెట్లు ఘనంగా మొదలుపెట్టారు. పారా స్ప్రింటర్, తెలంగాణకు చెందిన జీవాంజి దీప్తి సత్తాచాటింది. 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో హీట్-2లో పాల్గొన్న ఆమె 58.35 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఇక, ఫైనల్‌లో దీప్తి మెరుగైన ప్రదర్శన చేసింది. 55.16 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టింది. తుర్కియేకు చెందిన ఐసెల్ ఒండర్(54.51 సెకన్లు) స్వర్ణం దక్కించుకుంది.

గత రెండేళ్లుగా దీప్తి అంతర్జాతీయ వేదికపై అదరగొడుతోంది. 2023లో జరిగిన ఆసియా గేమ్స్‌లో, గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు, హైజంపర్ శైలేశ్ కుమార్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో అతను 1.91 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచింది. అదే ఈవెంట్‌లో మరో భారత పారా అథ్లెట్ వరుణ్ సింగ్ 1.85 మీటర్ల జంప్‌తో కాంస్య పతకం సాధించాడు. దీంతో మొదటి రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.


Next Story