టీమిండియా గ్రాండ్ విక్టరీ.. పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-09 08:58:19  IST  )

టీమిండియా విశ్వవిజేతగా నిలవడంపై పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించారు.

టీమిండియా గ్రాండ్ విక్టరీ.. పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మూడవసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ అద్భుత ప్రదర్శనను అందరూ కొనియాడుతున్నారు. పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియాపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత జట్టు విశ్వవిజేతగా నిలవడం వెనుక కేవలం ఆటగాళ్ల ప్రతిభే కాకుండా, భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న పక్కా ప్రణాళికలు, విధానాలు ఉన్నాయని అక్తర్ కొనియాడారు. మెరిట్ ప్రాతిపదికన సాగుతున్న ఈ 'సిస్టమ్' వల్లే భారత్ ఈ స్థాయికి చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు ఎంపికలో చూపిన చొరవను అక్తర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ఆటగాళ్లలోని అసలైన నైపుణ్యాన్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్ వంటి వారిని జట్టులోకి తీసుకురావడానికి గంభీర్ గట్టిగా నిలబడ్డారని, ఆ నమ్మకమే జట్టును మరింత బలోపేతం చేసిందని అక్తర్ విశ్లేషించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రీడాకారులకు భారత్ ఇచ్చిన వీడ్కోలు తీరు అద్భుతమని మెచ్చుకున్నారు. సీనియర్ల నుంచి యువతకు బాధ్యతలు అప్పగించే క్రమంలో టీమ్ ఇండియా చూపిన పరిణతిని పాకిస్థాన్ వంటి దేశాలు పాఠాలుగా నేర్చుకోవాలని ఆయన సూచించారు. భారత జట్టులో కనిపిస్తున్న ఐక్యత చూస్తుంటే ముచ్చటగా ఉందని అక్తర్ అన్నారు. మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అందరూ కలిసికట్టుగా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వారి క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో లోపించిన క్రమశిక్షణ, ఐక్యత, సరైన విధానాలు భారత క్రికెట్‌లో పుష్కలంగా ఉన్నాయని, అందుకే వారు నేడు జగజ్జేతలుగా నిలిచారని అక్తర్ స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ గుడికి గంభీర్, సూర్యకుమార్

Next Story