నేను చూసిన బెస్ట్ క్యాచ్ ఇదే : Sachin Tendulkar

by Harish |   (  Updated:2026-04-17 13:14:47  IST  )

నేను చూసిన బెస్ట్ క్యాచ్ ఇదే :  Sachin Tendulkar
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా భారీ షాట్ ఆడగా.. జంప్ చేసి బంతిని అందుకున్న శ్రేయస్ అయ్యర్ గాల్లోనే బౌండరీ లైన్ దాటగా కాలు కింద పెట్టకముందే బాల్‌ను మైదానంలో ఉన్న బార్ట్‌లెట్‌కు విసిరాడు. బార్ట్‌లెట్ క్యాచ్ పట్టడంతో పాండ్యా అవుటవ్వాల్సి వచ్చింది. దీంతో ‘సూపర్ శ్రేయస్ అయ్యర్’ అంటూ అతనిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అయ్యర్‌ను ప్రశంసిస్తూ పోస్టు పెట్టాడు. తాను ప్రత్యక్షంగా చూసిన బెస్ట్ క్యాచ్ ఇదేనని చెప్పాడు.

ఈ క్యాచ్ కేవలం అయ్యర్ అథ్లెటిజం వల్లే కాకుండా అతని అసాధారణమైన అవగాహన, శీఘ్ర నిర్ణయం వల్ల ప్రత్యేకంగా నిలిచిందన్నాడు. ‘అతను బంతి వేగాన్ని, ఎత్తును, బౌండరీ రోప్ ఎక్కడ ఉంది, తాను ఎంత దూరంలో ఉన్నాడు అన్న విషయాలను పర్ఫెక్ట‌గా జడ్జ్ చేసి జంప్ చేశాడు. ఆ తర్వాత కూడా గాల్లోనే బంతిని పట్టుకుని, కాలు కింద పెట్టకముందే బంతిని తన సహచరుడికి విసిరాడు. అప్పుడు కూడా తన టీమ్‌మేట్ ఎక్కడ ఉన్నాడన్న అవగాహన ఉంది. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగింది. ఇది గ్రహించడానికి అవగాహన, సమయస్ఫూర్తి, శారీరక సామర్థ్యం, సంమయనం అవసరం. నేను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒక్కటి’అని సచిన్ రాసుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాండ్యా క్యాచ్ ఆ సమయంలో చాలా కీలకమైంది. పాండ్యా క్రీజులో ఉండి ఉంటే ముంబై 220-230 వరకు లక్ష్యాన్ని పెట్టి ఉండొచ్చు. అప్పుడు ఛేదన పంజాబ్‌కు కష్టమయ్యేది.

Next Story