ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ క్లారిటీ.. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తుందా?

by Harish |

త్వరలోనే జరగబోయే ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ క్లారిటీ.. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలోనే జరగబోయే ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే, ఇటీవల మల్టీనేషనల్ టోర్నీల్లో పాక్‌తో మ్యాచ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వగా.. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. శనివారం ఓ జాతీయ మీడియాతో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విధానాలనే బీసీసీఐ ఫాలో అవుతుందని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం అమలు ఉన్న పాలసీ ప్రకారం మల్టీ నేషనల్ టోర్నమెంట్‌లు లేదా ఇంటర్నేషనల్ టోర్నీల్లో భారత్‌తో సత్సంబంధాలు లేని దేశాలతో ఆడేందుకు కేంద్రం ఎలాంటి పరిమితి విధించలేదు. కాబట్టి, ఏ మల్టీనేషనల్ టోర్నీలోనైనా భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడుతుంది. ఆసియా కప్ ఆసియా ఖండానికి సంబంధించింది. కాబట్టి, ఆడాల్సిందే. అలాగే, ఐసీసీ టోర్నీల్లో కూడా మనతో స్నేహపూర్వకంగా లేని దేశం ఉన్నప్పుడు కూడా ఆడాలి. కానీ, ద్వైపాక్షిక విషయానికొస్తే మేము శత్రు దేశాలతో ఆడం.’అని సైకియా తెలిపారు.

ప్రభుత్వం రూపొందించిన విధానానికి బీసీసీఐ కట్టుబడి ఉంటుందని నొక్కి చెప్పారు. కేవలం క్రికెట్‌ను మాత్రమే కాకుండా అన్ని ఆటలను దృష్టిలో పెట్టుకుని పాలసీని రూపొందించినట్టు తెలిపారు. ఆసియా కప్, ఐసీసీ టోర్నీ, ఫిఫా టోర్నమెంట్, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య వంటి మల్టీ నేషనల్ టోర్నీలను బహిష్కరిస్తే లేదా ఏదైనా దేశంతో ఆడకపోతే భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించే పాలసీని తీసుకొచ్చిందన్నారు.


Next Story