ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు : జై షా

by Harish |

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు : జై షా
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో భద్రత కారణాలను సాకుగా చూపుతూ టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ బెదిరించడం వంటి సంఘటనలతో టోర్నీకి ముందు కాస్త అనిశ్చితి నెలకొంది. దీనిపై మౌనం వీడిన ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దదని కాదన్నారు. ‘ఐసీసీ చైర్మన్‌గా చెబుతున్నా ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు. ఒక్క జట్టు మాత్రమే సంస్థ నిర్మించదు. ఐసీసీ అంటే అన్ని జట్ల కలయిక.’అని తెలిపారు.

అలాగే, టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ..‘ఈ వరల్డ్ కప్ అన్ని వ్యూయర్‌షిప్ రికార్డులను అధిగమించింది. ఒకేసారి 7.2 మిలియన్ల మంది వీక్షకులను నమోదు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. భారత్‌ను అమెరికా ఇబ్బందిపెట్టింది. పాకిస్తాన్‌ను నెదర్లాండ్స్ టెన్షన్ పెట్టింది. జింబాబ్వే ఏకంగా ఆస్ట్రేలియాను ఓడించింది. నేపాల్ కూడా ఇంగ్లాండ్‌ను భయపెట్టింది. శాశ్వత జట్లతో పోటీలో అసోసియేట్ టీమ్‌లు బాగా రాణించాయి.’అని జై షా చెప్పారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ సూర్య, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు ఓ సూచన చేశాడు.‘పై నుంచి కిందికి పడిపోవడానికి నెలలు మాత్రమే పడుతుంది. కింది నుంచి పైకి వెళ్లడానికి సంవత్సరాలు పడతాయి. కష్టపడుతూనే ఉండండి. అవార్డులు గెలవండి. నేను బీసీసీఐలో ఉన్నప్పుడు 2028 ఒలింపిక్స్ వరకూ ప్లాన్ చేశా. 2030, 2031, 2036కి కూడా సిద్ధం కావాలి.’అని జై షా చెప్పుకొచ్చారు.


Next Story