- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ రికార్డు సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 347 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసి చేజింగ్‌లో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు ఈ ఘనత భారత మహిళల జట్టు పేరిట ఉండేది. గతేడాది ఆస్ట్రేలియాపై 339 స్కోరును ఛేదించింది. ఇప్పుడు ఆ రికార్డును కివీస్ అధిగమించింది.
బుధవారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 346 రన్స్ చేసింది. అన్నెకె బోష్(91), వొల్వార్డ్(69), ట్రయోన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. సునె లూస్(40), సినాలో జఫ్టా(37) కూడా రాణించారు. 347 పరుగుల భారీ లక్ష్యం పెట్టినా సౌతాఫ్రికాకు షాక్ తప్పలేదు. చేజింగ్‌లో కివీస్ 49.4 ఓవర్లలో 350/8 స్కోరు చేసి నెగ్గింది. న్యూజిలాండ్ ఈ చారిత్రాత్మక గెలుపు సాధించడానికి కారణం కెప్టెన్ అమేలియా కెర్. జట్టు భారాన్ని ఆమె పూర్తిగా మీదేసుకుంది. భారీ శతకంతో కదం తొక్కింది. 139 బంతుల్లో 179 రన్స్‌తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. ఇసాబెల్లా గాజె(68) కూడా రాణించింది. తొలి వన్డే సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో కివీస్ నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆఖరిదైన మూడో వన్డే శనివారం జరగనుంది.






