NZ vs ENG : బ్రూక్ అసాధారణ పోరాటం వృథా.. తొలి వన్డే కివీస్‌దే

by Harish |

ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన వన్డే సిరీస్‌లో కివీస్ జట్టు శుభారంభం చేసింది.

NZ vs ENG : బ్రూక్ అసాధారణ పోరాటం వృథా.. తొలి వన్డే కివీస్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన వన్డే సిరీస్‌లో కివీస్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను కివీస్ బౌలర్లు మోస్తరు స్కోరుకే ఆలౌట్ చేశారు. బౌలర్లు ఫౌల్క్స్ 4 వికెట్లు, జాకబ్ డఫీ 3 వికెట్లతో విజృంభించడంతో ఆ జట్టు 35.2 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ జట్టులో జేమీ స్మిత్(0), డక్కెట్(2), రూట్(2), జాకబ్ బెథెల్(2), బట్లర్(4) వంటి స్టార్లందరూ విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు భారాన్ని మీదేసుకున్నాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏ మాత్రం వెనుకడుగు వేయని అతను కివీస్ బౌలర్లపై రెచ్చిపోయాడు. 101 బంతుల్లో 135 రన్స్ చేశాడు. అతని తర్వాత ఓవర్టన్(46) పర్వాలేదనిపించాడు. అయితే, కివీస్ లక్ష్యాన్ని ఛేదించడంతో బ్రూక్ పోరాటం వృథా అయ్యింది. 224 పరుగుల టార్గెట్‌ను కివీస్ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. డారిల్ మిచెల్(78 నాటౌట్), బ్రేస్‌వెల్(51) సత్తాచాటి న్యూజిలాండ్‌కు విజయాన్ని కట్టబెట్టారు. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం రెండో వన్డే జరగనుంది.


Next Story