మార్ష్ వన్ మ్యాన్ షో.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాను గెలిపించిన కెప్టెన్

by Harish |

న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మార్ష్ వన్ మ్యాన్ షో.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాను గెలిపించిన కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మూడో టీ20లో ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఆటే హైలెట్. వన్ మ్యాన్ షో ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది. ఆ జట్టులో సీఫర్ట్(48), బ్రేస్‌వెల్(26), నీషమ్(25) పర్వాలేదనిపించడంతో ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరు పెట్టింది. అయితే, 157 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తీవ్రంగా తడబడింది. హెడ్(8), మాథ్యూ షార్ట్(7), టిమ్ డేవిడ్(3), అలెక్స్ కేరీ(1), స్టోయినిస్(2) వంటి స్టార్లు విఫలమయ్యారు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టు భారాన్ని మార్ష్ ఒక్కడే మీదేసుకున్నాడు. అలాగనీ నిదానంగా ఆడలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను బెదరలేదు. కివీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. జట్టును గెలిపించే వరకూ బీష్మించుకుని క్రీజులో ఉన్న మార్ష్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. మార్ష్ 52 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Next Story