- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు షాక్
లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలవడం గమనార్హం.

- పాక్‌ను చిత్తు చేసిన న్యూజీలాండ్
- ట్రై నేషన్ సిరీస్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన కివీస్
- సెంచరీలతో కదం తొక్కిన విల్ యంగ్, లాథమ్
- కివీస్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన పాకిస్తాన్ బ్యాటర్లు
- 60 పరుగుల తేడాతో ఓడిన పాక్
దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ట్రై నేషన్ సిరీస్‌ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న కివీస్ జట్టు అదే ఫామ్‌ను చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించింది. కివీస్ బ్యాటర్లు విల్ యంగ్, లాథమ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు తడబడింది. బాబర్ అజామ్ (64), సల్మాన్ అఘా (42), కుష్‌దిల్ షా (69) పోరాడినా ఫలితం లేకపోయింది. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు విల్ యంగ్, డేవన్ కాన్వేలు కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే ఒకే ఓవర్ వ్యవధిలో ఓపెనర్ కాన్వే (10), కేన్ విలియమ్‌సన్ (1) వికెట్లను కోల్పోవడంతో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. డేరిల్ మిచెల్ (10) కూడా నిరాశపరచడంతో కివీస్ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ విల్ యంగ్, లాథమ్ కలిసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించారు. మొదట్లో ఇద్దరూ క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత భారీ షాట్లతో చెలరేగిపోయారు. ఒకా నొక దశలో 250 కూడా దాటడం కష్టమని భావించినా.. విల్ యంగ్, లాథమ్‌లు సెంచరీలతో చెలరేగిపోయారు. విల్ యంగ్ (107) అవుటైన తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు. బౌండరీలు సిక్సులతో చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో లాథమ్ కూడా దూకుగా ఆడి సెంచరీ నమోదు చేశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి 118 పరుగులు చేశాడు. దీంతో న్యూజీలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు సాధించింది. నీషమ్ షా, హరీశ్ రవూఫ్ చెరి రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్‌కు ఒక వికెట్ లభించింది.
ఇక 321 పరుగల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు మొదటి నుంచి తడబడింది. ఓపెనర్ సౌద్ షకీల్ (6) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ఇక ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (3) కూడా నిరాశ పరిచాడు. బాబర్ అజామ్, ఫకర్ జమాన్ కలిసి పాకిస్తాన్ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. అయితే వీరిద్దరూ చాలా నెమ్మదిగా పరుగులు చేయడంతో కావల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఫకర్ జమాన్ (24) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అయితే తర్వాత బరిలోకి దిగిన సల్మాన్ అఘా బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 48 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తయ్యబ్ తాహిర్ (1) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. చాలా స్లో రన్ రేట్‌తో పరుగులు చేసిన బాబర్ అజామ్ వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో పెవీలియన్ బాట పట్టాడు. బాబర్ అజామ్ 90 బంతుల్లో 64 పరుగులే చేశాడు. ఆఖర్లో ఖుష్‌దిల్ షా (69) దూకుడుగా ఆడినా బంతులు తక్కువగా ఉండటంతో భారీగా ఒత్తిడి పెరిగిపోయింది. టెయిలెండర్లు షాహీన్ అఫ్రీది (14), నీషమ్ షా (13), హరీశ్ రవూఫ్ (19) దూకుడుగా ఆడటానికి ప్రయత్నించినా కివీస్ బౌలర్ల ధాటికి త్వరగా అవుటయ్యారు. దీంతో పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజీలాండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. విలియయ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్ చెరి మూడు వికెట్లు, మాట్ హెన్రీ 2, మైఖెల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్‌లు తలా ఒక వికెట్ తీశారు. లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలవడం గమనార్హం.
స్కోర్ బోర్డు:
న్యూజీలాండ్ : విల్ యంగ్ (సి)(సబ్) ఫహీమ్ అష్రాఫ్ (బి) నీషమ్ షా 107, డేవన్ కాన్వే (బి) అబ్రార్ అహ్మద్ 10, విలియమ్‌సన్ (సి) రిజ్వాన్ (బి) నీషమ్ షా 1, డేరిల్ మిచెల్ (సి) షాహీన్ అఫ్రిది (బి) హరీశ్ రవూఫ్ 10, లాథమ్ 118 నాటౌట్, గ్లెన్ ఫిలిప్ (సి) ఫకర్ జమాన్ (బి) హరీశ్ రవూఫ్ 61, మిచెల్ బ్రేస్‌వెల్ 0 నాటౌట్; మొత్తం 320/5(50 ఓవర్లు)
వికెట్ల పతనం : 39-1, 40-2, 73-3, 191-4, 316-5
బౌలింగ్ : షాహీన్ అఫ్రిది (10-0-68-0), నీషమ్ షా (10-0-63-2), అబ్రార్ అహ్మద్ (10-0-47-1), హరీశ్ రవూఫ్ (10-0-83-2), కుష్‌దిల్ షా (7-0-40-0), సల్మాన్ అఘా (3-0-15-0)
పాకిస్తాన్ : సౌద్ షకీల్ (సి) మాట్ హెన్రీ (బి) విలియమ్ ఓరూర్కే 6, బాబర్ అజామ్ (సి) విలియమ్ సన్ (బి) శాంట్నర్ 64, మహ్మద్ రిజ్వాన్ (సి) గ్లెన్ ఫిలిప్ (బి) విలియమ్ ఓరూర్కే 3, ఫకర్ జమాన్ (బి) మైఖెల్ బ్రేస్‌వెల్ 24, సల్మాన్ అఘా (సి) మైఖెల్ బ్రేస్‌వెల్ (బి) నాథన్ స్మిత్ 42, తయ్యబ్ తాహిర్ (సి) విలియమ్‌సన్ (బి) శాంట్నర్ 1, ఖుష్‌దిల్ షా (సి) మైఖెల్ బ్రేస్‌వెల్ (బి) విలియమ్ ఓరూర్కీ 69, షాహీన్ అప్రిది (సి) లాథమ్ (బి) మాట్ హెన్రీ 14, నీషమ్ షా (బి) మాట్ హెన్రీ 13, హరీశ్ రవూవఫ్ (సి) డేరిల్ మిచెల్ (బి) శాంట్నర్ 19, అబ్రార్ అహ్మద్ 0 నాటౌట్; మొత్తం 260/10(47.2 ఓవర్లు)
వికెట్ల పతనం : 8-1, 22-2, 69-3, 127-4, 128-5, 153-6, 200-7, 229-8, 260-9, 260-10
బౌలింగ్ : మాట్ హెన్రీ (7.2-1.25-2), విలియమ్ ఓరూర్కీ (9-0-47-3), మైఖెల్ బ్రేస్‌వెల్ (10-1-38-1), గ్లెన్ ఫిలిప్ (9-0-63-0), మిచెల్ శాంట్నర్ (10-0-66-3), నాథన్ స్మిత్ (2-0-20-1)






