పాక్ క్రికెట్‌ లీగ్‌లో విచిత్రం.. ఇలా జరగడం నేనెప్పుడూ చూడలేదన్న లబుషేన్

by Harish |

పాక్ క్రికెట్‌ లీగ్‌లో విచిత్రం.. ఇలా జరగడం నేనెప్పుడూ చూడలేదన్న లబుషేన్
X

దిశ, స్పోర్ట్స్ : వివాదాల మధ్య మొదలైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) తొలి మ్యాచ్‌తోనే వార్తల్లో నిలిచింది. పీఎస్‌ఎల్‌లో గురువారం జరిగిన లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. బౌలర్లు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని జెర్సీకి, ప్యాంట్లకు రుద్దుకోవడం సహజమే. కానీ, జెర్సీ కలర్ అంటుకోదు. ఈ మ్యాచ్‌లో మాత్రం తెల్ల బంతి కలర్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్ బౌలర్ల జెర్సీ కలర్ అంటుకుని బంతి మొదట పింక్ కలర్‌లోకి ఆ తర్వాత రెడ్ కలర్‌ మారింది. ఇది చూసి ఆ జట్టు కెప్టెన్ లబుషేన్ కూడా అవాక్కయ్యాడు. ఇదేంటి? అని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పుడు అంపైర్లు మరొక బంతిని ఇచ్చి మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ అనంతరం లబుషేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘జెర్సీ కలర్ అంటుకుని రంగు మారడం నేనెప్పుడు చూడలేదు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా దీనిని సరిచేస్తారని ఆశిస్తున్నా’అని వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి ప్లేయర్ల జెర్సీ‌లు ఎంత నాసికరంగా ఉన్నాయో అర్థమవుతుంది. దీంతో తొలి మ్యాచ్‌తోనే పాక్ లీగ్ ట్రోలింగ్‌కు గురైంది. ‘ఇది పీఎస్‌ఎల్ కాదు.. పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా.. పాక్ క్రికెట్ పరువు గంగలో కలిసింది. గల్లీ క్రికెట్ అనుకుంటున్నారా?’అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దిగారు.


Next Story