- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఖేల్ రత్న’కు హార్దిక్ పేరు సిఫార్సు.. అర్జున అవార్డుకు తెలుగమ్మాయి పేరు షార్ట్‌లిస్ట్
ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డులకు సెలెక్షన్ కమిటీ బుధవారం ఆటగాళ్ల పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డులకు సెలెక్షన్ కమిటీ బుధవారం ఆటగాళ్ల పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. భారత పురుషుల హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌ను భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నకు సిఫార్సు చేసింది. భారత హాకీ జట్టులో మిడ్‌పీల్డర్ హార్దిక్ కీలక సభ్యుడు. 2021 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌ల్లో భారత్ పతకాలు గెలిచిన జట్టులో అతను భాగం. ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఈ ఏడాది అతనొక్కడినే సిఫార్సు చేయడం గమనార్హం. గతేడాది డి. గుకేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బాకర్‌లకు ఖేల్ రత్న ప్రదానం చేశారు. దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డుకు సెలెక్షన్ కమిటీ 24 మంది అథ్లెట్లను షార్ట్‌లిస్ట్ చేసింది.
తెలుగమ్మాయి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపిచంద్ అర్జున అవార్డుకు నామినేట్ అయ్యింది. మహిళల డబుల్స్‌లో ఆమె భాగస్వామి ట్రీసా జాలీ పేరు కూడా ఉంది. భారత చెస్ ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్, విదిత్ గుజరాతీ, బాక్సర్ నరేందర్, హాకీ ప్లేయర్లు రాజ్‌కుమార్ పాల్, లాల్రెమ్సియామి, షూటర్లు అఖిల్, మెహులి ఘోష్, కబడ్డీ ప్లేయర్లు సుర్జీత్, పూజ, ఖోఖో క్రీడాకారిణి నిర్మల భటి, డెఫ్ షూటర్ శ్రీకాంత్, పారా షూటర్ రుద్రాన్ష్, రోయర్ అర్వింద్ సింగ్, జిమ్నాసిస్ట్ ప్రణతి నాయక్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీ, పోలో ప్లేయర్ పద్మనాభ్ సింగ్, రెజ్లర్ సోనమ్ మాలిక్ పేర్లను సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించింది. అథ్లెటిక్స్ నుంచి తేజస్విన్ శంకర్, ప్రియాంక, మహ్మద్ అఫ్సల్, ఎక్తా భ్యాన్(పారా అథ్లెటిక్స్)లు కూడా అర్జున అవార్డుకు సిఫార్సు అయ్యారు. ఇక యోగా నుంచి తొలిసారిగా ఆర్తి పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు. అయితే, క్రీడా అవార్డుల షార్ట్‌లిస్ట్‌లో ఒక్క క్రికెటర్ పేరు కూడా లేకపోవడం గమనార్హం. 2023లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీనే అర్జున అవార్డు అందుకున్న చివరి క్రికెటర్.






