కేకేఆర్ నిర్ణయంపై ముస్తాఫిజుర్ షాకింగ్ రియాక్షన్

by Malleboina Mahesh |

బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో భారత్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడనియవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.

కేకేఆర్ నిర్ణయంపై ముస్తాఫిజుర్ షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో భారత్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడనియవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ (BCCI) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను రిలీవ్ చేయాలని కేకేఆర్ జట్టుకు ఆదేశించింది. ఈ మేరకు ఆ జట్టు అతన్ని రిలీవ్ చేసింది. కేకేఆర్ నిర్ణయంపై బౌలర్ ముస్తాఫిజుర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రూ. 9.20 కోట్ల భారీ ధరకు తనను కొనుగోలు చేసిన తర్వాత, కేవలం రాజకీయ కారణాలతో ఇలా తొలగించడంపై ముస్తాఫిజుర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. "వదిలేయాలని వాళ్లు నిర్ణయించుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను?" అంటూ ఆయన ఇచ్చిన సమాధానం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.

రంగంలోకి బంగ్లా మాజీ కెప్టెన్లు

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు రంగంలోకి దిగి.. ఐపీఎల్ బాయ్‌కాట్‌కు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు ఖలీద్ సుజాన్, అష్రాఫుల్ తీవ్రంగా స్పందించారు. బీసీసీఐ నిర్ణయం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. "క్రికెట్‌ను, రాజకీయాలను విడివిడిగా చూడాలి. ఒక దేశంతో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఒక ఆటగాడి కెరీర్‌ను దెబ్బతీయడం సరికాదు" అని వారు పేర్కొన్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రజలు ఐపీఎల్‌ను బాయ్‌కాట్ చేయాలని వారు పిలుపునిచ్చారు.

టీ20 వరల్డ్ కప్ వేదికల మార్పుకు డిమాండ్

భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచులను వేరే దేశానికి మార్చాలని వారు ఐసీసీని డిమాండ్ చేశారు. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, అందుకే మ్యాచులను తటస్థ వేదికలకు తరలించాలని వారు కోరడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చిచ్చు రేపుతోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే నెపంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతినేలా కనిపిస్తున్నాయి.

Next Story