వన్డేలకు ముష్ఫికర్ గుడ్ బై

by Ajay Maddhiboyina |

తాను దేశం కోసం ముందడుగు వేశాను. ఎంతో కష్టపడ్డాను. కానీ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని ముష్ఫికర్ చెప్పాడు.

వన్డేలకు ముష్ఫికర్ గుడ్ బై
X

- ఓడీఐల నుంచి తప్పుకున్న బంగ్లా క్రికెటర్

- బంగ్లా తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్

- చాంపియన్స్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రహీమ్

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా జట్టు పేలవ ప్రదర్శన అనంతరం ముష్పికర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బుధవారం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. తాజాగా ముష్ఫికర్ రహీమ్ కూడా వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 సీజన్‌లో ముష్ఫికర్ రహీమ్ ‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కేటగిరి ఏలో చేర్చింది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వారిని కేటగిరీల వారీగా విభజించింది. అయితే కేటగిరి ఏలో ఉన్న ముష్ఫికర్ చాంపియన్స్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇండియాపై డకౌట్ కాగా, న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ముష్ఫికర్ పేలవ ప్రదర్శనపై బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

తాను దేశం కోసం ముందడుగు వేశాను. ఎంతో కష్టపడ్డాను. కానీ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని ముష్ఫికర్ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో మా జట్టు విజయాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. కానీ దేశం కోసం ఎప్పుడు గ్రౌండ్‌లోకి అడుగు పెట్టినా 100 శాతానికి మించి కష్టపడ్డానని ముష్ఫికర్ చెప్పాడు. గత కొన్ని వారాలుగా అనేక సవాళ్లు ఎదుర్కుంటున్నారు. ఇక నా డెస్టినీ ఏంటో అర్థమయ్యింది. అందుకే వన్డేలకు గుడ్ బై చెప్తున్నాను. ఈ ప్రయాణంలో సహకరించిన కుటుంబం, స్నేహితులు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు అని ముష్ఫికర్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా, బంగ్లా తరపున అత్యధిక వన్డేలుఆడిన ఆటగాడిగా ముష్ఫికర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్ 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Next Story