యువీని ధోనీనే జట్టు నుంచి తప్పించాడా?.. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఏమన్నాడంటే?

by Harish |

యువీని ధోనీనే జట్టు నుంచి తప్పించాడా?.. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : తన కొడుకు యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించడానికి ధోనీనే కారణమని యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ చాలా సందర్భాల్లో నిందించాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఆ ఆరోపణలు కొట్టిపారేశాడు. యువీని తప్పించడంలో ధోనీ పాత్ర లేదని, అది పూర్తిగా సెలెక్షన్ కమిటీ నిర్ణయమని స్పష్టం చేశాడు. ‘యువరాజ్ సింగ్‌ను తొలగించాలని ధోనీ ఎప్పుడూ చెప్పలేదు. సెలెక్షన్ కమిటీపై అతను పూర్తిగా నమ్మకం ఉంచేవాడు. ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. ఓ తండ్రి తన కొడుకు ఏం తప్పు చేయలేదని భావించడం సహజమే. కానీ, మరొకరిపై నింద వేయడం సరికాదు.’అని పాటిల్ చెప్పుకొచ్చాడు.

పాటిల్ నాలుగేళ్లపాటు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే సెలెక్షన్ కమిటీ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ వంటి స్టార్లను జట్టు నుంచి తప్పించింది.సచిన్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఏడాది ముందే బీసీసీఐ.. సచిన్ స్థానాన్ని భర్తీ చేయాలని చూసిందంట. ఈ విషయాన్ని తాజాగా పాటిల్ వివరించాడు. ‘నీ ప్లాన్స్ ఏంటి? అని సచిన్‌ను అడిగా. ఎందుకు? అని అడిగాడు. నీ రిప్లేస్‌మెంట్‌ కోసం బోర్డు చూస్తోందని అతనికి చెప్పా. అతను షాక్‌కు గురయ్యాడు. సీరియస్‌గా అడుగుతున్నారా? అని అడిగాడు. అవునని చెప్పా. జట్టు నుంచి ప్లేయర్‌ను సెలెక్టర్లు తప్పించొచ్చు. కానీ, నీ కెరీర్ ముగిసిందని ఆటగాళ్లకు చెప్పలేరు. మేము అతని ప్రణాళికల గురించ అడిగాం. అతను కొనసాగుతానని చెప్పాడు. మేము సరే అన్నాం. సచిన్ తప్పించారని మాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.కానీ షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా, రహానె వంటి వాళ్లు వచ్చారని ఎవరూ మాట్లాడరు’అని పాటిల్ చెప్పుకొచ్చాడు.


Next Story