టీ20లకు గుడ్ బై.. ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ షాకింగ్ ప్రకటన

by Phanindra |

టీ20లకు గుడ్ బై చెప్తున్నట్లు ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ షాకింగ్ ప్రకటన చేశాడు. ఇండియా టెస్టులు, 2027 వరల్డ్ కోసమే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పాడు.

టీ20లకు గుడ్ బై.. ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ షాకింగ్ ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై వన్డేలు, టెస్టులపైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నానని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని స్టార్క్ వెల్లడించాడు. కెరీర్లో ఆస్ట్రేలియా తరఫున 65 టీ20లు ఆడిన స్టార్క్.. తన అద్భుతమైన బౌలింగ్‌తో టీంకు ఎన్నో మరపురాని విజయాలందించాడు. ముఖ్యంగా 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ టీంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ గేమ్స్ ఏవీ స్టార్క్ ఆడలేదు. ‘నాకు టెస్టులు చాలా ముఖ్యం. అందుకని టీ20లు ఎంజాయ్ చేయలేదని కాదు. ఆస్ట్రేలియా తరఫున టీ20లు ఆడిన ప్రతిక్షణాన్ని ప్రేమించా’ అని స్టార్క్ వివరించాడు.

అయితే త్వరలో భారత్‌లో జరగబోయే టెస్టు సిరీస్, ఆపై 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ మీద తాను ఫోకస్ పెడుతున్నానని చెప్పాడు. ‘ఈ రెండు టోర్నీల కోసం ఎదురు చూస్తున్నా. వీటిలో ఫ్రెష్‌గా ఉండాలంటే టీ20 రిటైర్‌మెంట్ నిర్ణయమే సరైందని నా నమ్మకం’ అని చెప్పుకొచ్చాడు. తను ఇప్పుడు తప్పుకుంటే.. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం మరో పేసర్‌ను సిద్ధం చేసేందుకు కూడా సమయం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా తన అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగే స్టార్క్‌ను తాము కచ్చితంగా మిస్ అవుతామని, అయితే అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఆస్ట్రేలియా టీం చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ చెప్పాడు.

స్టార్క్ టీ20 కెరీర్

తను ఆడిన 65 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో స్టార్క్ మొత్తం 1458 బంతులు విసిరాడు. ఓవరాల్‌గా 1881 పరుగులు సమర్పించుకొని 79 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ లెక్కలు చూస్తే అద్భుతమైన బౌలర్‌గా పేరున్న స్టార్క్‌కు పొట్టి ఫార్మాట్ అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి.

Next Story