గాయంతో ఏడాదిపాటు దూరం.. పునరాగమనంలోనే గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చాను

by Harish |

భారత దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయి చాను పునరాగమనంలో సత్తాచాటింది.

గాయంతో ఏడాదిపాటు దూరం.. పునరాగమనంలోనే గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చాను
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయి చాను పునరాగమనంలో సత్తాచాటింది. పారిస్ ఒలింపిక్స్‌ తర్వాత గాయం కారణంగా ఆమె క్రీడకు దూరమైంది. దాదాపు ఏడాది తర్వాత పాల్గొంటున్న తొలి అంతర్జాతీయ ఈవెంట్‌లోనే తానేంటో నిరూపించింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 48 కేజీల కేటగిరీలో ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి మొత్తం 193 కేజీలు ఎత్తి విజేతగా నిలిచింది. స్నాచ్‌లో మీరా రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 84 కేజీలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 87 కేజీలు ఎత్తినప్పటికీ చెల్లుబాటు కాలేదు. క్లీన్ అండ్ జర్క్‌లో చాను రెండో ప్రయత్నంలో 109 కేజీలు ఎత్తింది. పైనల్ ప్రయత్నంలో 113 కేజీలు లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. భారత్‌కే చెందిన సౌమ్య సునిల్ దల్వి మొత్తం 177 కేజీలు(స్నాచ్‌లో 76 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 101 కేజీలు) లిఫ్ట్ చేసి రజతం గెలుచుకుంది. నైజీరియా అథ్లెట్ రుత్ అసోక్వో న్యోంగ్(167 కేజీలు) కాంస్యం సాధించింది. మరోవైపు, పురుషుల 56 కేజీల యూత్ డివిజన్‌లో ధర్మజ్యోతి దేవ్‌ఘరియా మొత్తం 224 కేజీలు ఎత్తి స్వర్ణం గెలిచాడు. మహిళల 44 కేజీల యూత్ కేటగిరీలో ప్రీతిస్మిత భోయ్ 150 కిలోలతో విజేతగా నిలిచింది.


Next Story