ఇంగ్లండ్‌లో గెలవాలంటే అదే కరెక్ట్.. టీమిండియా ఈ తప్పు చేస్తూనే ఉంది: క్లార్క్

by Phanindra |

ఇంగ్లండ్‌లో గెలవాలంటే టీమిండియా ఎవర్ని ఆడించాలో మైకేల్ క్లార్క్ చెప్పాడు. అలాగే భారత్ రిపీట్ చేస్తున్న తప్పును కూడా ఎత్తిచూపాడు.

ఇంగ్లండ్‌లో గెలవాలంటే అదే కరెక్ట్.. టీమిండియా ఈ తప్పు చేస్తూనే ఉంది: క్లార్క్
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టెస్టు సిరీసును గెలవాలంటే టీమిండియా కచ్చితంగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని ఆసీస్ మాజీ దిగ్గజం మైకేల్ క్లార్క్ అన్నాడు. ఎలాంటి పిచ్‌పై అయినా కుల్దీప్ వికెట్లు తీసుకోగలడని, అలాంటి ప్లేయర్ని ఆడించడానికి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ‘బౌలింగ్ విషయం మాట్లాడితే.. నేను ఎవర్నీ పర్టిక్యులర్‌గా విమర్శించాలని అనుకోవడం లేదు. కానీ వాళ్లు కుల్దీప్‌ను ఆడించాల్సింది. తొలి టెస్టులో భారత బౌలింగ్‌కు చాలా పెద్ద ప్లస్ అయ్యేవాడు’ అని క్లార్క్ చెప్పాడు.

అలాగే టీమిండియా అనవసరంగా బ్యాటింగ్ డెప్త్ కోసం చూసి, బౌలింగ్‌ను బలహీనంగా మార్చుకుందన్నాడు. ‘ఇండియా కొంతకాలంగా ఇదే పని చేస్తోంది. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనో, లేదంటే బ్యాటింగ్ డెప్త్ కోసమో చూస్తున్నారు. దీనికోసం తమ నెంబర్ వన్ స్పిన్నర్‌ను రిస్క్‌లో పెడుతున్నారు. కానీ ఇంగ్లండ్‌లో గెలవాలంటే 20 వికెట్లు తీసుకోవాల్సిందే’ అని స్పష్టంచేశాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రాకు సరైన సహకారం లభించలేదని గుర్తుచేశాడు.

‘బుమ్రా గొప్ప స్టార్. తనే బౌలింగ్ ఎటాక్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. మిగతా ముగ్గురు పేసర్లు కొన్నిసార్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ వీళ్లు వికెట్లు తీసుకునే మరిన్ని మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. జడేజా నేను అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్సులో లెఫ్ట్ హ్యాండర్ల ఆఫ్‌స్టంప్ అవతల ఏర్పడిన రఫ్‌ను ఉపయోగించుకోవాల్సింది. తను మరీ స్ట్రెయిట్‌గా బౌలింగ్ చేశాడనిపించింది’ అని క్లార్క్ వివరించాడు.

Next Story