WPL 2025 : ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీ.. ముంబై ఆశలు నీళ్లు

by Harish |

WPL 2025 : ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీ.. ముంబై ఆశలు నీళ్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయంతో ముగించింది. ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. ఆరంభంలో వరుసగా రెండు విజయాలతో టోర్నీని ఘనంగా మొదలుపెట్టిన ఆర్సీబీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. వరుస ఓటములతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యి గ్రూపు దశకే పరిమితమైంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో ముంబైపై 11 పరుగుల తేడాతో నెగ్గి టోర్నీలో తన ప్రయాణాన్ని ముగించింది. ముందుగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది. స్మృతి మంధాన(53) హాఫ్ సెంచరీకితోడు ఎల్లీస్ పెర్రీ(49 నాటౌట్), రిచా ఘోష్(36), జార్జియా వారేహమ్(31 నాటౌట్), మేఘన(26) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక, ఛేదనలో పోరాడినా ముంబై 188/9 స్కోరుకే పరిమితమైంది. స్నేహ్ రాణా(3/26)కుతోడు ఇతర బౌలర్లు మెరిసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. స్కివర్(69) అర్ధ శతకంతో పోరాడినా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

స్కివర్ పోరాటం వృథా

ఛేదనలో ముంబై పోరాడినప్పటికీ కీలక ప్లేయర్లు నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లు స్నేహ్ రాణా, ఎల్లీస్ పెర్రీ, కిమ్ గార్త్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఆరంభం నుంచే కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్లు హేలీ మాథ్యూస్(19), అమేలియా కెర్(9)లను స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ముంబై పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం నాట్ స్కివర్ బ్రంట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలు దంచింది. మరో ఎండ్‌లో ఆమెకు సహకారం లభించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(20) ఆకట్టుకోలేదు. జట్టును ఆదుకోవడానికి స్కివర్ ఒంటరి పోరాటం చేసి 129/3 స్కోరుతో జట్టును మంచి స్థితిలోనే నిలబెట్టింది. స్కివర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 రన్స్ చేసి అవుటైంది. ఆ తర్వాత స్కివర్‌ జోరును ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. అమన్‌జోత్ కౌర్(17), యాస్తికా భాటియా(4), కమలిని(6), సంస్కృతి(10) వరుసగా వికెట్లు కోల్పోవడంతో ముంబై ఓటమి ఖరారైంది. అయితే, సజన(23) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించింది.

దంచికొట్టారు

అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్ దూకుడుగా సాగింది. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. గత మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన కెప్టెన్ స్మృతి మంధాన ఆఖరి పోరులో సత్తాచాటింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీతో రాణించింది. మరో ఓపెనర్ మేఘన(26) కాసేపు క్రీజులో ఉన్నా మెరుపులు మెరిపించింది. మంధాన, మేఘన బౌండరీలు బాదడంతో 3.3 ఓవర్లలోనే స్కోరు 40 దాటింది. మేఘన అవుటైన తర్వాత మంధానకు ఎల్లీస్ పెర్రీ తోడైంది. పెర్రీ సహకారంతో మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే, కాసేపటికే ఆమె దూకుడుకు అమేలియా కెర్ చెక్ పెట్టింది. పెర్రీ బౌండరీలు కొడుతూనే ఆచితూచి ఆడుతూ చివరి వరకు నిలిచింది. మరో ఎండ్‌లో రిచా ఘోష్(36 ), జార్జియా వారేహమ్(31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా జార్జియా ఆఖరి మూడు ఓవర్లలో చిన్నపాటి విధ్వంసం సృష్టించి 50 పరుగులు పిండుకోవడంతో ఆర్సీబీ 199 రన్స్ చేసింది.

ఫైనల్‌కు ఢిల్లీ

ముంబై ఫైనల్ అవకాశాలపై ఆర్సీబీ నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 12 పాయింట్లతో నేరుగా ఫైనల్‌కు చేరుకునేది. ముంబై ఓటమితో ఢిల్లీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ముంబైతో పోలిస్తే మెరుగైన నెట్‌రన్‌రేటు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చింది. గురువారం ముంబై, గుజరాత్ ఎలిమినేటర్ ఆడనున్నాయి. అందులో గెలిచిన జట్టు ఈ నెల 15న ఫైనల్‌లో ఢిల్లీని ఢీకొట్టనుంది.

Next Story