ఆ బ్యాట్లు వాడుకోవచ్చు.. ఎంసీసీ సంచలన నిర్ణయం

by Harish |

ఆ బ్యాట్లు వాడుకోవచ్చు.. ఎంసీసీ సంచలన నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ చట్టాలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మంగళవారం పలు క్రికెట్ చట్టాల్లో సవరణలు చేసింది. మొత్తం 73 సవరణలు చేయగా.. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2022 తర్వాత ఎంసీసీ క్రికెట్ చట్టాల్లో మార్పులు చేసింది. క్రికెట్‌ మైదానంలో ఇప్పటివరకు నిషేధించిన లామినేటెడ్ లేదా టైప్-డి బ్యాట్లను అనుమతి ఇవ్వడం తాజా సవరణలో ప్రధానమైనది. గతంలో లామినేటెడ్ బ్యాట్లకు జూనియర్ క్రికెట్‌లో మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు ఆ రకమైన బ్యాట్లను ఓపెన్ ఏజ్ క్రికెట్‌లో కూడా ఉపయోగించడానికి ఎంసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏ స్థాయి క్రికెట్‌లో వాడాలనే నిర్ణయం క్రికెట్ బోర్డులకే ఇచ్చింది. ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరలు భారీగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడం వర్తమాన క్రికెటర్లకు భారంగా మారింది. లామినేటెడ్ బ్యాట్లు మూడు వేర్వేరు మూడు వేర్వేరు చెక్క ముక్కలను కలిపి తయారు చేస్తారు. ముందు భాగంలో ఇంగ్లీష్ విల్లో.. వెనుక భాగంలో తక్కువ ధరలో దొరికే చెక్క ముక్కలను వాడతారు. దీనివల్ల బ్యాట్ల నాణ్యత ఏమాత్రం తగ్గకపోగా ధర తగ్గుతుంది.

ఆఖరి ఓవర్‌లో అవుటైనా..

టెస్టులు, మల్టీ డే మ్యాచ్‌ల్లో ఇంతకుముందు రోజులో చివరి ఓవర్‌లో ఏదైనా బంతికి బ్యాటర్ అవుటైతే అక్కడే ఆ రోజు ఆటను ముగించే వారు. బౌలర్ మిగతా బంతులను మరుసటి రోజు వేసేవారు. ఇప్పుడు ఎంసీసీ దాన్ని సవరించింది. బ్యాటర్ అవుటైనా ఆఖరి ఓవర్ పూర్తి చేస్తేనే ఆ రోజు ఆట ముగుస్తుందని వెల్లడించింది. అలా చేయడం వల్ల ఆటలో డ్రామాను కోల్పోతున్నామని తెలిపింది. ఈ నిర్ణయం ఫీల్డింగ్ జట్టుకు ఉపయోగకరంగా మారనుంది. ఇంతకుముందు బౌలర్ రన్‌ అప్ ప్రారంభించినప్పటి నుంచి బంతి పూర్తయ్యే వరకూ వికెట్ కీపర్ స్టంప్స్ వెనకాలే ఉండాలి. స్టంప్స్ ముందుకు వస్తే నో బాల్ ఇచ్చేవారు. కానీ, కొత్త రూల్ ప్రకారం.. బౌలర్ రన్‌ అప్ సమయంలో వికెట్ కీపర్ చేతులు స్టంప్స్ ముందు ఉండొచ్చని ఎంసీసీ పేర్కొంది. బంతి రిలీజ్ అయిన తర్వాత స్టంప్స్ వెనకాల ఉండాలని చెప్పింది.

ఆ చట్టాల్లో కూడా మార్పులు

షార్ట్ రన్ తర్వాత నెక్ట్స్ బాల్‌‌కు ఏ బ్యాటర్ స్ట్రైక్‌లో ఉండాలనేది ఇప్పటివరకు అస్పష్టంగా ఉండేది. అయితే, ఏ బ్యాటర్ స్ట్రైక్‌లో ఉండాలనేది ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ నిర్ణయిస్తాడని ఎంసీసీ వెల్లడించింది. ఇప్పటివరకు బంతి బౌలర్ చేతిలోనో లేదా వికెట్ కీపర్ చేతిలోనో ఉంటే డెలివరీ సంపూర్ణమైనట్టు భావించేవారు. తాజా సవరణ ప్రకారం.. ఇప్పుడు ఫీల్డర్ చేతిలో ఉన్నా లేదా మైదానంలో కదలంకుడా ఉన్నప్పుడు అంపైర్ డెలివరీ పూర్తయినట్టు చెప్పొచ్చు. పరుగులు సాధించే పరిస్థితుల్లో ఈ మార్పు డెలివరీ ముగిసినట్టు స్పష్టం చేస్తుందని ఎంసీసీ పేర్కొంది. అలాగే, ఓవర్ త్రో‌లను సాధారణ మిస్‌ఫీల్డ్‌ల నుంచి వేరు చేసింది. ఓవర్‌త్రో అంటే పరుగులను నియత్రించడానికి లేదా రనౌట్‌ చేయడానికి స్టంప్స్‌పైకి విసిరే ప్రయత్నమని నిర్వచించింది.


Next Story