జట్టు ఎంపికలో ఎవరి జోక్యం ఉండొద్దు.. గంభీర్‌కు చురకలు అంటించిన గవాస్కర్

by Harish |

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో భారత్ తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జట్టు ఎంపికలో ఎవరి జోక్యం ఉండొద్దు.. గంభీర్‌కు చురకలు అంటించిన గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో భారత్ తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవడం, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బ్యాటింగ్ సామర్థ్యం ఉండే బౌలర్లకు హెడ్ కోచ్ గంభీర్ ప్రాధాన్యత ఇచ్చాడన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో గిల్‌‌దే తుది నిర్ణయం అయి ఉండకపోవచ్చని తెలిపాడు. తుది జట్టు ఎంపికలో గిలే నిర్ణయం తీసుకోవాలన్నాడు.

హెడ్ కోచ్ సహా ఇతరుల జోక్యం ఉండొద్దని గంభీర్‌కు చురకలు అంటించాడు. ‘గిల్ కెప్టెన్. ప్రజలు అతని గురించి, అతని కెప్టెన్ గురించి మాట్లాడుకుంటారు. కెప్టెన్ జట్టు అవుతుంది గానీ కోచ్ జట్టు అవదు. జట్టులో శార్దూల్ ఉండాలని గిల్ కోరుకుని ఉండడు. అతను కుల్దీప్ వైపు మొగ్గుచూపి ఉంటాడు. ఇవన్నీ బయటకు రావని నాకు తెలుసు. కానీ, అన్నింటికీ కెప్టెన్‌దే బాధ్యత. ఎందుకంటే జట్టును నడిపించేది అతను. కాబట్టి, ఏదైనా అతని నిర్ణయమై ఉండాలి.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గిల్ కుర్రాడైనా అతనిలో నాయకత్వ లక్షణాలు చూసే అతనికి కెప్టెన్సీ ఇచ్చారని తెలిపాడు.


Next Story