చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం

by Harish |

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది.

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఐసీసీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. భారత్‌తో తొలి వన్డే ఆడిన అతను హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో బెథెల్ గాయపడ్డాడు. ఎడమ తొడకండాల నొప్పితో బాధపడ్డాడు. గాయం కారణంగా అతను రెండో వన్డేకు దూరమయ్యాడు.

స్కానింగ్‌లో ఎడమ తొడకండరాల్లో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోవడానికి 4-6 వారాలు పడుతుందని సమాచారం. బెథెల్‌ చాంపియన్స్ ట్రోఫీకి దూరమవడంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, రెండో వన్డే అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ బెథెల్ గాయంపై స్పందించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతాడని నాకు తెలుసు. అది నిజంగా చాలా నిరాశ కలిగిస్తుంది. ’అని వ్యాఖ్యానించాడు.గతేడాది సెప్టెంబర్‌లో బెథెల్ అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలోనే అతను జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. కాబట్టి, అతని లోటు ఇంగ్లాండ్‌పై ప్రభావం చూపనుంది. అలాగే, అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా ఇంగ్లాండ్‌కు సవాల్‌తో కూడుకున్నదే.


Next Story