- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాత్విక్ జోడీకి షాక్.. మలేసియా ఓపెన్‌లో సెమీస్‌లో ఓటమి
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ సెమీస్‌లో పరాజయం పాలైంది.

దిశ, స్పోర్ట్స్ : తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి మళ్లీ నిరాశే. మలేసియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌కు మరోసారి దగ్గరగా వచ్చి చేజార్చుకుంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ జోడీ పోరాటం సెమీస్‌లో ముగిసింది. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత జోడీ 10-21, 15-21 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కిమ్ వాన్ హో-సియో సూంగ్ జే జంట చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌కు ముందు వరుసగా మూడు విజయాలతో జోరు కనబర్చిన సాత్విక్, చిరాగ్.. కీలక మ్యాచ్‌లో తడబడ్డారు. తొలి గేమ్‌లో 6-11తో వెనుకబడ్డ వారు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో 19 నిమిషాల్లో కొరియా జంట తొలి గేమ్‌ను దక్కించుకుంది. ఇక, రెండో గేములో భారత షట్లర్లు పుంజుకున్నారు. 11-8తో ఆధిక్యంలో నిలిచారు. అనంతరం వరుస తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయారు. దీంతో తొలి మలేసియా ఓపెన్ టైటిల్ నిరీక్షణకు సాత్విక్ జోడీ ఈ సారి కూడా తెరదించలేపోయింది. 2023లో సెమీస్‌లో, గతేడాది ఫైనల్‌లో ఓడిపోయింది. భారత జోడీ నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. సాత్విక్, చిరాగ్ జంట ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఇండియా ఓపెన్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.






