వినేశ్ పునరాగమనంలో డ్రామా.. అయోధ్యకు చేరుకున్న రెజ్లర్.. వెనక్కి తగ్గని డబ్ల్యూఎఫ్‌ఐ

by Harish |

వినేశ్ పునరాగమనంలో డ్రామా.. అయోధ్యకు చేరుకున్న రెజ్లర్.. వెనక్కి తగ్గని డబ్ల్యూఎఫ్‌ఐ
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పునరాగమనంలో డ్రామా నెలకొంది. ఇటీవల భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) వినేశ్‌ను జూన్ 26 వరకు దేశీయ టోర్నీల్లో పాల్గొనడానికి అనర్హురాలుగా ప్రకటించింది. యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం.. రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లు ఆరు నెలలు నోటీసు కాలంలో ఉండాలని పేర్కొంది. అయితే, వినేశ్ మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి సిద్ధమైంది. మంగళవారం మహిళల ఫ్రీస్టైల్ పోటీలు జరగనుండగా.. సోమవారం ఆమె అయోధ్యకు చేరుకుంది.

ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్‌ఐ షోకాజ్ నోటీసుపై ఆమె స్పందించింది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు తాను అర్హురాలినేని తెలిపింది. తన పునరాగమనం గురించి జూన్‌లోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ)కు తెలియజేశానని, కాబట్టి, రిటైర్మెంట్ అథ్లెట్లకు సంబంధించిన వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ‌ కోడ్‌లోని 5.6.1 రూల్ తనకు వర్తించదని చెప్పింది. కానీ, డబ్ల్యూఎఫ్‌ఐ వర్గాలు మాత్రం ఆమెను టోర్నీలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చేది లేదని చెబుతున్నాయి.

భారత రెజ్లింగ్ సమాఖ్య తమ షోకాజ్ నోటీసులో వినేశ్‌ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిందని, డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిందని కూడా పేర్కొంది. తాజాగా వినేశ్ ఇచ్చిన వివరణ పట్ల డబ్ల్యూఎఫ్‌ఐ సంతృప్తి చెందలేదు. వినేశ్ కేవలం తన అర్హత అంశాన్ని మాత్రమే ప్రస్తావించిందని, క్రమశిక్షణా ఆరోపణలపై స్పందించలేదని డబ్ల్యూఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. కాబట్టి, దీనిపై విచారణ జరిపి ఓ నిర్ణయం తీసుకునే వరకూ ఆమెను పోటీల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేమని పేర్కొన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హత వేటు పడిన తర్వాత వినేశ్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత తను వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


Next Story