FIFA WORLD CUP : సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచి ఫిఫా వరల్డ్ కప్

by Harish |

ఫుట్‌బాల్ అభిమానులకు ఫుల్ కిక్కు ఇచ్చేందుకు సాకర్ సమరం వచ్చేసింది.

FIFA WORLD CUP : సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచి ఫిఫా వరల్డ్ కప్
X

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ అభిమానులకు ఫుల్ కిక్కు ఇచ్చేందుకు సాకర్ సమరం వచ్చేసింది. నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్-2026 ప్రారంభం. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12:30 గంటలకు మెక్సికో, సౌతాఫ్రికా మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ సారి కూడా ఆ జట్టు టైటిల్ ఫేవరెట్. టైటిల్ నిలబెట్టుకోవాలని ఆ జట్టు భావిస్తున్నది. 2022‌లో ఫైనల్‌లో ఓడిన ఫ్రాన్స్‌తోపాటు స్పెయిన్ కూడా హాట్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. అలాగే, క్రొయేషియా, జర్మనీ, బ్రెజిల్ కూడా టైటిల్ పోటీలో ఉన్నాయి. 2022‌లో సంచలన ప్రదర్శన చేసిన మొరాకోను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.

తొలిసారిగా 48 జట్లు

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే ఈ ప్రపంచకప్ అతిపెద్ద టోర్నీగా నిలవనుంది. గతంలో 38 జట్లే పాల్గొన్నాయి. ఈ ఎడిషన్‌లో 48 జట్లు పాల్గొనబోతున్నాయి. ఆ జట్లను నాలుగేసి టీమ్‌ల చొప్పున 12 గ్రూపులుగా విభజించారు. గ్రూపు దశలో ప్రతి జట్టు మూడు గేములు ఆడుతుంది. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే, గ్రూపు దశలో మూడో స్థానంలో నిలిచిన అత్యుత్తమమైన 8 జట్లు కూడా ముందడుగు వేస్తాయి. మొత్తం 32 జట్లతో నాకౌట్ రౌండ్ జరుగుతుంది. జట్లు పెరగడంతో ఈ సారి అదనంగా నాకౌట్ దశలో రౌండ్-32ను చేర్చారు. ఆ రౌండ్‌లో గెలిచిన 16 జట్లు ప్రీక్వార్టర్స్‌కు వెళ్తాయి. ప్రీక్వార్టర్స్ నుంచి 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు, అక్కడి నుంచి సెమీస్‌కు నాలుగు టీమ్‌లు క్వాలిఫై అవుతాయి. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

మెస్సీ, రోనాల్డ్‌కు ఇదే చివరి వరల్డ్ కప్

దిగ్గజ ఫుట్‌బాలర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో‌లకు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. 38 ఏళ్ల మెస్సీ, 41 ఏళ్ల రొనాల్డో.. ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే రొనాల్డో ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అవుతానని ప్రకటించాడు. మెస్సీ కూడా ఇదే ఆఖరిదన్న ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. 2022‌లో మెస్సీ అర్జెంటీనా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా అదరగొట్టి తన జట్టుకు మరో వరల్డ్ కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. రొనాల్డో కూడా తన టీమ్ పోర్చుగల్‌కు చారిత్రాత్మక టైటిల్ అందించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకు పోర్చుగల్ ఒక్కసారి కూడా ఫిఫా వరల్డ్ కప్ గెలవలేదు. 1996లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటికీ ఆ జట్టుకు ఉత్తమ ప్రదర్శన. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలిన రొనాల్డో‌ కూడా జాతీయ జట్టుకు ఇప్పటివరకు వరల్డ్ కప్ అందించలేకపోయాడు. అతని కెరీర్‌లో ఇప్పటికీ అది పెద్ద లోటే. చివరిసారిగా ఆడబోతున్న ఈ ప్రపంచకప్‌లోనైనా అతను తన లోటును పూడ్చుకుంటాడో లేదో చూడాలి.

Next Story