కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలో వారి పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు

by Harish |

కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలో వారి పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్స్‌లకు ద్రవిడ్, కుంబ్లే పేరు పెట్టనున్నారు. మాజీ మహిళా క్రికెటర్ శాంత రంగస్వామి పేరిట మరో స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) శనివారం నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ భారత్ తరపున మూడు ఫార్మాట్లలో 605 ఇన్నింగ్స్‌ల్లో 24,208 రన్స్ చేసింది. టెస్టుల్లో సచిన్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన రెండో భారత క్రికెటర్ ద్రవిడ్. మరోవైపు, కుంబ్లే 501 మ్యాచ్‌ల్లో 956 వికెట్లు తీశాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసింది అతనే. కుంబ్లే 2016-17 వరకు, ద్రవిడ్ 2021-2024 వరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఇంకోవైపు, శాంత రంగస్వామి మహిళల క్రికెట్‌లో దిగ్గజంగా గుర్తింపు పొందింది. భారత మహిళల క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ ఆమెనే. జులన్ గోస్వామి, మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా తర్వాత స్టేడియంలో స్టాండ్స్‌కు పేరు పెట్టిన నాలుగో మహిళా క్రికెటర్ రంగస్వామి. గతేడాది ఐపీఎల్ విజయోత్సవాల్లో తొక్కిసలాటతో చిన్నస్వామి స్టేడియంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేయగా.. మైదానం కొత్తగా ముస్తాబువుతోంది.


Next Story