FIDE Women’s World Cup : ఫైనల్‌కు హంపి.. టైటిల్‌ ఇక భారత గ్రాండ్‌‌మాస్టర్‌దే

by Harish |

మహిళల ఫిడే వరల్డ్ కప్‌ను తొలిసారిగా భారత గ్రాండ్‌మాస్టర్ సొంతం కావడం లాంఛనమే.

FIDE Women’s World Cup : ఫైనల్‌కు హంపి.. టైటిల్‌ ఇక భారత గ్రాండ్‌‌మాస్టర్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల ఫిడే వరల్డ్ కప్‌ను తొలిసారిగా భారత గ్రాండ్‌మాస్టర్ సొంతం కావడం లాంఛనమే. భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లలో ఒకరు విజేతగా నిలబోతున్నారు. జార్జియాలో జరుగుతున్న టోర్నీలో ఇప్పటికే దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా కోనేరు హంపి కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది. గురువారం ముగిసిన సెమీస్‌లో హంపి 5-3తేడాతో చైనాకు చెందిన లీ టింగ్జీపై విజయం సాధించింది. 8 గేములపాటు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చివరికి హంపినే విజయం వరించింది. తొలి రెండు క్లాసికల్ గేములు డ్రాగా ముగియడంతో మ్యాచ్ టై బ్రేకర్స్‌కు వెళ్లింది. అక్కడ కూడా త్వరగా ఎవరూ ఓటమిని అంగీకరించలేదు. తొలి రెండు టై బ్రేకర్స్‌లో కూడా పాయింట్స్ పంచుకున్నారు. కానీ, మూడో ర్యాపిడ్ గేములో చైనా గ్రాండ్‌మాస్టర్ గెలిచి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, ఆ తర్వాత హంపి పుంజుకుంది. వరుసగా మూడు ర్యాపిడ్ గేము‌లను నెగ్గి విజేతగా నిలిచింది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో హంపి, దివ్య మధ్య ఫైనల్ జరగనుంది. ఇప్పటివరకు మహిళల ఫిడే వరల్డ్ కప్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ గెలవలేదు. ఈ సారి హంపి, దివ్యలలో ఒకరు చరిత్ర తిరగరాయనున్నారు.


Next Story