రూమర్లు వర్సెస్ రియాలిటీ: విరాట్ కోహ్లీ లండన్ ట్రిప్ వెనుక అసలు నిజం ఇదీ!

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచారు.

రూమర్లు వర్సెస్ రియాలిటీ: విరాట్ కోహ్లీ లండన్ ట్రిప్ వెనుక అసలు నిజం ఇదీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచారు. తనపై వస్తున్న ఒక వింత ప్రచారాన్ని కోహ్లీ తనదైన శైలిలో కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌పై స్పందిస్తూ, రూమర్లు సృష్టించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ షెడ్యూల్ మధ్యలో దొరికే విరామ సమయంలో భారత్ నుండి లండన్‌కు వెళ్లి రావడానికి కోహ్లీ ప్రత్యేకంగా 'చార్టర్డ్ ఫ్లైట్స్' ఏర్పాటు చేయాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కుటుంబంతో గడపడానికి ఆయన ఈ డిమాండ్ చేశారనేది ప్రచారం చేశారు.

కోహ్లీ నవ్వుతూ ఇచ్చిన సమాధానం..

ఈ అవాస్తవ ప్రచారాన్ని 37 ఏళ్ల కోహ్లీ చాలా తేలికగా తీసుకున్నారు. ఆ వైరల్ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. కేవలం రెండు నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. తద్వారా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం కల్పితాలేనని స్పష్టం చేశారు. బయట వినిపించే రూమర్లు ఎలా ఉన్నా, మైదానంలో కోహ్లీ గణాంకాలు మాత్రం సరికొత్త చరిత్రకు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా నిలవడానికి కోహ్లీ కేవలం 300 పరుగుల దూరంలో ఉన్నారు. ఆర్సీబీ తరపున (IPL + ఛాంపియన్స్ లీగ్ కలిపి) ఇప్పటివరకు 282 మ్యాచ్‌ల్లో 9,085 పరుగులు చేశారు. ఒకే ఫ్రాంచైజీ తరపున 10,000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచేందుకు ఆయన చేరువలో ఉన్నారు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో 414 మ్యాచ్‌ల్లో 13,543 పరుగులు సాధించిన కోహ్లీ.. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు ఉన్న 14,000 పరుగుల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గత సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు చేసి (54.75 సగటు, 144.71 స్ట్రైక్ రేట్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్, ఈసారి ఐపీఎల్ 2026లో కూడా అదే ఊపును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story