- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్డే వరల్డ్ కప్-2027లో ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. అలాంటి పరిస్థితే ఉంటే ఆసక్తి లేదని వెల్లడి

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్-2027 ఆడటంపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రపంచకప్ ఆడాలనే ఉందని, కానీ తన అర్హత, విలువను నిరూపించుకోవాలనే భావన కలిగించే చోట మాత్రం ఉండనంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘నన్ను చాలా మంది 2027 వన్డే ప్రపంచకప్ ఆడతావా? అని అడిగారు. నేను ఆడాలనుకుంటే క్రికెట్ ఆడతాను. భారత్ తరపున ప్రపంచకప్ ఆడటం అద్భుతం. నేను జట్టుకు విలువ తీసుకొస్తానని అనుకుంటే భాగమవుతా. జట్టు కూడా అదే అనుకుంటే నన్ను గుర్తిస్తుంది. కానీ, నా అర్హతను, విలువను నిరూపించుకోవాలనేలా వాతావరణం ఉంటే మాత్రం నేను అక్కడ ఉండను.’అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే నా ప్రిపరేషన్ విషయంలోగానీ, ఆట విషయంలోగానీ నిజాయతీగా ఉంటానని తెలిపాడు.
తాను చాలా కష్టపడతానని, ఎవరి కంటే తక్కువ కాదన్నాడు. ‘నేను ఆటను సరైన మార్గంలో ఆడతాను. వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్లపాటు ఆ బౌండరీ నుంచి ఈ బౌండరీ వరకు పరుగు పెట్టమని చెప్పింది. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ పని చేస్తా. అందుకు తగ్గట్టుగానే నా సన్నద్ధత ఉంటుంది. 50 ఓవర్లలో ప్రతి బంతి నా కెరీర్‌లో ఆఖరి బంతిగానే చూస్తా. ఫీల్డింగ్‌లోనైనా, బ్యాటింగ్‌లోనైనా, పరుగు తీయడమైనా అలాగే ఆలోచిస్తా. జట్టు కోసం నేను చేయాల్సిందంత చేస్తా. ఇంతా చేశాక కూడా జట్టులో స్థానం కోసం నా యోగ్యతను, విలువను నిరూపించుకోవాల్సి పరిస్థితిలో నేను ఉంటే ఆ స్థానం నాకు సరైంది కాదు. ఈ విషయంలో నేను క్లారిటీగా ఉన్నా.’అని కోహ్లీ తెలిపాడు. క్రికెట్ ఆడటం తనకు ఇష్టం కాబట్టే ఆడుతున్నానని, ఎవరికీ నిరూపించుకోవడానికి కాదని స్పష్టం చేశాడు. కష్టపడటం, నిబద్ధత విషయంలో తాను స్పష్టంగా ఉంటానని చెప్పాడు. ‘ఏదైనా సిరీస్‌కు రెండు, మూడు వారాల ముందు సిద్ధమయ్యే రకం కాదు నేను. ఏడాదంతా రెడీగా ఉంటా. రాబోయే సిరీస్ నువ్వు ఆడాలంటే సిద్ధంగా ఉన్నానని చెబుతా. నేనెప్పుడూ అలాగే ఉంటా. నా రోజు వారీ జీవితం అలాగే ఉంటుంది.’అని చెప్పుకొచ్చాడు.






