కింగ్ ఈజ్ బ్యాక్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన కోహ్లీ

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కింగ్ ఈజ్ బ్యాక్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను కేవలం వన్డేలలో మాత్రమే ఆడనున్నాడు. ఈ ఏడాది అతను చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. న్యూజిలాండ్‌తో ఆడిన ఫైనలే అతను చివరిగా ఆడింది. అనంతరం ఐపీఎల్‌‌లో పాల్గొన్నాడు. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విరాట్ కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. త్వరలోనే అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వన్డేలలో పునరాగమనం చేసేందుకు కింగ్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు.

తాజాగా అతను ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. లండన్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో విరాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను కోహ్లీ శుక్రవారం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలో కోహ్లీతోపాటు గుజరాత్ టైటాన్స్ సహాయక కోచ్ నయీమ్ అమిన్‌ కూడా ఉన్నాడు. కోహ్లీ ప్రాక్టీస్‌ను నయీమ్ అమిన్ పర్యవేక్షిస్తున్నాడు. ‘డియర్ బ్రదర్.. నాకు సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నిన్ను చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది.’అని కోహ్లీ రాసుకొచ్చాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ తిరిగి మైదానంలో కనిపించనున్నాడు. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించాల్సి ఉండగా.. ఆ సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ పోస్ట్‌పోన్ అవడం కోహ్లీ పునరాగమనం ఆలస్యమైంది.


Next Story