శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన ఖవాజా, జోష్ ఇంగ్లిస్.

by Harish |

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(232) డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు.

శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన ఖవాజా, జోష్ ఇంగ్లిస్.
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(232) డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. తొలి రోజు సెంచరీ చేసిన అతను ఓవర్‌నైట్ స్కోరు 147తో ఆట కొనసాగించి టెస్టుల్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు. అలాగే, శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు ఉన్నాయి. తొలి రోజే సెంచరీ చేసిన మరో ఆసిస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(141)తో కలిసి అతను మూడో వికెట్‌కు 266 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్‌ను జత చేశాడు.

స్మిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్(102) అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటాడు. దూకుడుగా ఆడిన అతను 90 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో శిఖర్ ధావన్(2013లో ఆస్ట్రేలియాపై 85 బంతుల్లో శతకం) తర్వాత అరంగేట్ర టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఖవాజా డబుల్ సెంచరీ, ఇంగ్లిస్ శతకంతో అదరగొట్టడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను 654/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 44/3 స్కోరుతో కష్టాల్లో పడింది. వరుసగా రెండో రోజు ఆటలో ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయం సాధించే అవకాశాలను మెరుగుపర్చుకుంది.


Next Story