మహరాజ్ మ్యాజిక్.. తొలి వన్డేలో 98 పరుగులతో ఆసీస్ చిత్తు

by Phanindra |

సఫారీ స్పిన్నర్ మహరాజ్ మ్యాజిక్ చేశాడు. వన్డేల్లో తొలి ఫైఫర్‌తో చెలరేగాడు. దీంతో తొలి వన్డేలో 98 పరుగులతో ఆసీస్‌ను సౌతాఫ్రికా చిత్తుచేసింది.

మహరాజ్ మ్యాజిక్.. తొలి వన్డేలో 98 పరుగులతో ఆసీస్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా చెలరేగింది. అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన సఫారీలు.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించారు. కైన్స్‌లోని కజలీస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఏకంగా 98 పరుగుల తేడాతో ఓటమిచవిచూసింది. సఫారీ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్ (5/33) వన్డేల్లో తన తొలి ఫైఫర్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు మార్క్రమ్ (82), రికెల్టన్ (33) శుభారంభం అందించారు.

టెంబా బవుమా (65), మాథ్యూ బ్రీజ్‌కే (57) విలువైన పరుగులు జోడించారు. ట్రిస్టియన్ స్టబ్స్ (0), డెవాల్డ్ బ్రెవిస్ (6) విఫలమవగా.. ముల్డర్ (31 నాటౌట్), కేశవ్ మహరాజ్ (13) ఫర్వాలేదనిపించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు కూడా మంచి ఆరంభమే దక్కింది. ట్రావిస్ హెడ్ (27)తో కలిసి కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) అద్భుతంగా ఆడాడు. కానీ లబుషేన్ (1), కామెరూన్ గ్రీన్ (3), జోష్ ఇంగ్లిస్ (5), అలెక్స్ క్యారీ (0), ఆరన్ హార్డీ (4) దారుణంగా విఫలమయ్యారు.

చివర్లో ద్వార్షూయిస్ (33), నాథన్ ఎల్లీస్ (14), ఆడమ్ జంపా (11) పోరాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మహరాజ్‌ ఐదు వికెట్లతో రెచ్చిపోగా.. బర్గర్, ఎన్గిడీ చెరో రెండు వికెట్లతో రాణించారు. దీంతో ఆసీస్ జట్టు 40.5 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీసులో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ మాకే వేదికగా శుక్రవారం జరగనుంది.

Next Story