Junior Hockey World Cup : భారత్ బోణీ అదిరింది.. తొలి మ్యాచ్‌లో చిలీపై భారీ విజయం

by Harish |

చెన్నయ్‌లో శుక్రవారం ప్రారంభమైన హాకీ జూనియర్ వరల్డ్ కప్‌ను భారత్ ఘనంగా మొదలుపెట్టింది.

Junior Hockey World Cup : భారత్ బోణీ అదిరింది.. తొలి మ్యాచ్‌లో చిలీపై భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్‌లో శుక్రవారం ప్రారంభమైన హాకీ జూనియర్ వరల్డ్ కప్‌ను భారత్ ఘనంగా మొదలుపెట్టింది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ భారత్ ఆ దిశగా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో చిలీపై 7-0 తేడాతో విజయం సాధించింది. భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. చిలీ నుంచి అసలు పోటీనే ఎదురుకాలేదు. ఆరంభంలో కాస్త ప్రతిఘటించడంతో భారత్ గోల్ చేయడానికి ఆలస్యమైంది.

కానీ 16వ నిమిషంలో రోసన్ కుజుర్ తొలి గోల్ చేసి ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 21వ నిమిషంలో మళ్లీ రోసనే రెండో గోల్ చేశాడు. దిల్‌రాజ్ సింగ్ వరుసగా 25వ, 34వ నిమిషాల్లో గోల్ చేయడంతో భారత్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పట్టు సాధించింది. అజిత్ యాదవ్, అన్మోల్ ఎక్కా, రోహిత్ కూడా చెరో గోల్ చేశారు. చివరి వరకూ భారత ప్లేయర్లు దూకుడుగా చిలీని మట్టికరిపించారు. శనివారం జరిగే రెండో గ్రూపు మ్యాచ్‌లో ఒమన్‌తో భారత్ తలపడనుంది. మొదటి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఒమన్‌పై 4-0తో స్విట్జర్లాండ్, జపాన్‌పై 4-1తో అర్జెంటీనా, చైనాపై 5-3తో న్యూజిలాండ్, ఈజిప్ట్‌పై 8-0తో స్పెయిన్, నమీబియాపై 12-1తో బెల్జియం విజయాలు నమోదు చేశాయి.


Next Story