బుమ్రా ఫైఫర్.. ఇక బ్యాటర్లదే భారం..!

by Phanindra |

లార్డ్స్ టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. బ్యాటర్లు తడబడుతున్నారు. వాళ్లు మూడో రాణిస్తే భారత్ గెలవడం దాదాపు ఖాయం.

బుమ్రా ఫైఫర్.. ఇక బ్యాటర్లదే భారం..!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తానెందుకు నెంబర్ వన్ టెస్టు బౌలరో మరోసారి నిరూపించాడు. ‘క్రికెట్ పుట్టినిల్లు’గా పిలిచే లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా లార్డ్స్ లీడర్ బోర్డులో తన పేరును లిఖించుకున్నాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఎన్నో రికార్డులు తిరగరాసిన బుమ్రా.. ఇంగ్లండ్‌ను 387 పరుగులకు కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్‌కు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలియానే చెప్పాలి. ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (13), శుభ్‌మన్ గిల్ (16) విఫలమయ్యారు. మూడోరోజు భారత బ్యాటర్లు రాణించడంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

లార్డ్స్ టెస్టు రెండో రోజును భారత జట్టు 145/3 స్కోరు వద్ద ముగించింది. జస్ప్రీత్ బుమ్రా (5/74) మరోసారి విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అంతకుముందు, 251/4 స్కోరు వద్ద ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను బుమ్రా ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. స్టోక్స్‌ (44)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రూట్‌ (104), క్రిస్ వోక్స్ (0)ను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. అయితే జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్సే (56) అద్భుతంగా పోరాడి ఇంగ్లండ్‌కు 387 పరుగుల మంచి స్కోరును అందించారు. బుమ్రాతోపాటు సిరాజ్ కూడా రెండు వికెట్లతో రాణించాడు.

తొలి ఇన్నింగ్సులో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదనే చెప్పాలి. కేఎల్ రాహుల్ (53 నాటౌట్) రాణించినప్పటికీ.. యశస్వి జైస్వాల్ (13), కరుణ్ నాయర్ (40), శుభ్‌మన్ గిల్ (16) ఫెయిలయ్యారు. నాలుగేళ్ల తర్వాత తొలి టెస్టు ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జైస్వాల్ వెనుదిరగ్గా.. వోక్స్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు. రీఎంట్రీలో నిరాశపరుస్తున్న నాయర్.. మరోసారి తనకు దక్కిన ఆరంభాన్ని మంచి స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్‌తోపాటు రిషభ్ పంత్ (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 387 ఆలౌట్

జాక్ క్రాలీ(సి)పంత్(బి)నితీశ్ రెడ్డి 18, బెన్ డక్కెట్(సి)పంత్(బి)నితీశ్ రెడ్డి 23, ఓలీ పోప్(సి)జురెల్(బి)జడేజా 44, జోరూట్(బి)బుమ్రా 104 , హ్యారీ బ్రూక్(బి)బుమ్రా 11, బెన్ స్టోక్స్(బి)బుమ్రా 44, క్రిస్ వోక్స్(సి)జురెల్(బి)బుమ్రా 0, జేమీ స్మిత్(సి)జురెల్(బి)సిరాజ్ 51, బ్రైడన్ కార్సె(బి)సిరాజ్ 56, జోఫ్రా ఆర్చర్(బి)బుమ్రా 4, షోయబ్ బషీర్ 1 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 31.

వికెట్ల పతనం : 43-1, 44-2, 153-3, 172-4, 260-5, 271-6, 271-7, 355-8, 370-9, 387-10

బౌలింగ్ : బుమ్రా(27-5-74-5), ఆకాశ్ దీప్(23-3-92-0), సిరాజ్(23.3-6-85-2), నితీశ్ రెడ్డి(17-0-62-2), జడేజా(12-1-29-1), వాషింగ్టన్ సుందర్(10-1-21-0)

భారత్ తొలి ఇన్నింగ్స్: 145/3 (43 ఓవర్లలో)

యశస్వి జైస్వాల్(సి)బ్రూక్(బి)ఆర్చర్ 13, కేఎల్ రాహుల్ 53 బ్యాటింగ్, కరుణ్ నాయర్(సి)రూట్(బి)స్టోక్స్ 40, శుభ్‌మన్ గిల్(సి)జేమీ స్మిత్(బి)వోక్స్ 16, రిషభ్ పంత్ 19 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం: 13-1, 74-2, 107-3

బౌలింగ్: క్రిస్ వోక్స్(13-1-56-1), జోఫ్రా ఆర్చర్(10-3-22-1), బ్రైడన్ కార్సె(8-1-27-0), బెన్ స్టోక్స్(6-2-16-1), షోయబ్ బషీర్(6-1-22-0)

Next Story