టీమిండియా షాక్.. ఆసియా కప్‌కు బుమ్రా దూరం?

by Harish |

ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రిత్ బుమ్రా‌ను మూడు టెస్టులకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి టీమ్ మేనేజ్‌మెంట్ కట్టుబడి ఉంది.

టీమిండియా షాక్.. ఆసియా కప్‌కు బుమ్రా దూరం?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా‌ను మూడు టెస్టులకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి టీమ్ మేనేజ్‌మెంట్ కట్టుబడి ఉంది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు అతనికి విశ్రాంతినిచ్చింది. పనిభారం నిర్వహణలో భాగంగా టీమిండియా ఈ నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో బుమ్రా వర్క్‌లోడ్‌పై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో జరిగే ఆసియా కప్‌లో బుమ్రా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. బుమ్రాకు నెల రోజుల సమయం ఉంది. కానీ, ఆసియా కప్ ముగిసిన వెంటనే వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 29న ఆసియా ఫైనల్ జరగనుండగా.. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో విండీస్‌తో తొలి టెస్టు ప్రారంభంకానుంది. నవంబర్‌లో సౌతాఫ్రికాతో మరో టెస్టు సిరీస్‌లో పాల్గొనబోతుంది.

ఈ నేపథ్యంలో బుమ్రా వర్క్‌లోడ్‌ కీలకం కానుంది. కాబట్టి, బుమ్రా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో? అన్న చర్చ జరుగుతుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. అతను రెండింటిలో ఒక్కటి మాత్రమే ఆడతాడని తెలుస్తోంది. బుమ్రా టీ20, టెస్టులలో ఏ ఫార్మాట్‌‌కు ప్రాధాన్యత ఇస్తాడనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ‘బుమ్రా ఆసియా కప్‌లో పాల్గొని భారత్ ఫైనల్‌ ఆడితే అతను వెస్టిండీస్‌తో ఆడే అవకాశం లేదు. నెల రోజు బ్రేక్ తర్వాత బుమ్రా ఆసియా కప్ ఆడతాడా?.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు బుమ్రా అవసరమా?..సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడగలడా? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.’అని బోర్డు వర్గాలు తెలిపాయి. బుమ్రా టెస్టు క్రికెట్‌ను ఇష్టపడతాడని, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్స్ కూడా ప్రమాదంలో ఉన్నందును అతను ఆసియా కప్ ఆడే అవకాశాలు చాలా తక్కువేనని పేర్కొన్నాయి. జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడటం ద్వారా టీ20 వరల్డ్ కప్‌-2026కు సన్నద్ధమవుతాడని తెలిపాయి.


Next Story