బుమ్రా‌కు రెస్ట్ ఇవ్వడానికి వర్క్‌లోడ్ కారణం కాదా?.. బయటపడిన అసలు విషయం

by Harish |

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడని విషయం తెలిసిందే.

బుమ్రా‌కు రెస్ట్ ఇవ్వడానికి వర్క్‌లోడ్ కారణం కాదా?.. బయటపడిన అసలు విషయం
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడని విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. నాలుగో టెస్టుతోనే అతను ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో పనిభారం కారణంగా ఐదో టెస్టుకు అతనికి విశ్రాంతినిచ్చారు. ఓవల్ టెస్టు ఆడకపోవడానికి వర్క్‌‌లోడే కారణమని అందరూ అనుకున్నారు. కానీ, అసలు కారణం అది కాదని తెలుస్తోంది. బుమ్రా గాయపడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు సదరు కథనాలు తెలిపాయి. ‘దురదృష్టవశాత్తు బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయితే ఆ గాయం అంత పెద్దదేమీ కాదు. సర్జరీ అవసరం లేదు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుంది. స్కానింగ్ రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాం’అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి.

అయితే, బుమ్రా గాయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేంటని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పనిభారం కారణంగా విశ్రాంతి ఇవ్వడంలో ఎవరికి సందేహాలు లేవు. కానీ, జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అనుమానాలు తలెత్తాయి. ఏ ప్లేయరైనా తుది జట్టులో లేకపోయినా పర్యటన ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడు. కానీ, బుమ్రా విషయంలో మాత్రం అలా జరగలేదు. అందుకు కారణం బుమ్రా గాయపడటమే అని తాజా కథనాలు పేర్కొన్నాయి. వచ్చే నెలలో ఆసియా కప్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలోనే బుమ్రా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆసియా కప్ నాటికి అతను కోలుకుంటాడా?అన్నది ప్రశ్నార్థకం. ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టుల్లో బుమ్రా 14 వికెట్లు తీశాడు.


Next Story