కోహ్లీ,రోహిత్ రిటైర్‌ అవ్వకముందే కెప్టెన్సీ వద్దన్న బుమ్రా.. కారణం ఇదే!

by Phanindra |

కోహ్లీ, రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించకముందే కెప్టెన్సీ జోలికి పోకూడదని బుమ్రా డిసైడ్ అయ్యాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్పేశాడట.

కోహ్లీ,రోహిత్ రిటైర్‌ అవ్వకముందే కెప్టెన్సీ వద్దన్న బుమ్రా.. కారణం ఇదే!
X

దిశ, స్పోర్ట్స్: రోహిత్ రిటైరయిన తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు వినబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై బుమ్రా స్వయంగా స్పందించాడు. బీసీసీఐ తనను టెస్టు కెప్టెన్ చేయాలని అనుకుందని, కానీ తను ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశానని తేల్చిచెప్పాడు. అరంగేట్రం చేసినప్పటి నుంచి గాయాలతో సతమతం అవుతున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో కూడా వెన్నునొప్పి వల్ల సడెన్‌గా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు రెడీ అవుతున్న బుమ్రా.. దినేష్ కార్తీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు.

కెప్టెన్సీ ఆఫర్ తిరస్కరించా..

‘రోహిత్, కోహ్లీ రిటైర్ అవడానికి ముందే.. ఐపీఎల్ జరుగుతున్న టైంలో బీసీసీఐతో మాట్లాడాను. ఐదు టెస్టుల సిరీసులో నా వర్క్‌లోడ్ ఎలా ఉంటుందనే విషయంపై చర్చించా. ఆ టైంలో నా వర్క్‌లోడ్ మేనేజ్ చేస్తున్న వారితో కూడా మాట్లాడా. నేను కొంచెం తెలివిగా వ్యవహరించాలని అర్థంచేసుకున్నా. అప్పుడే అన్ని టెస్టులు ఆడలేనని, కాబట్టి నన్ను కెప్టెన్‌గా చూడొద్దని బీసీసీఐకి స్పష్టంగా చెప్పేశా’ అని బుమ్రా వివరించాడు. ‘నాకు లీడర్‌షిప్ రోల్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచించింది. కానీ కేవలం మూడు టెస్టులే ఆడే నేను కెప్టెన్‌గా ఉండటం.. జట్టుకు న్యాయం చేసినట్లు కాదు. అందుకే టీం ముఖ్యమనే ఆలోచనతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను’ అని బుమ్రా వెల్లడించాడు.

Next Story