- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించిన వరల్డ్ నం.1 ప్లేయర్

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో పెను సంచలనం నమోదైంది. మెన్స్ సింగిల్స్ టైటిల్ హాట్ ఫేవరెట్ జెన్నిక్ సిన్నర్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. అన్‌సీడ్ ప్లేయర్, అర్జెంటీనాకు చెందిన సెరుండోలో అతనికి షాక్ ఇవ్వడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిన్నర్‌పై 6-3, 6-2, 5-7, 1-6, 1-6 తేడాతో సెరుండోలో విజయం సాధించాడు. ఫలితం ఐదో సెట్‌లో తేలడం గమనార్హం. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్ గెలుపునకు అడుగు దూరంలో ఉండగా తడబడ్డాడు. పారిస్‌లో ఎండ తీవ్రతను తట్టుకోలేక అలసిపోయిన అతను పట్టుకోల్పోవడమే కాకుండా గెలిచే మ్యాచ్‌నూ సమర్పించుకున్నాడు. 3 గంటల 36 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మొదట ఆధితప్యం సిన్నర్‌దే. అలవోకగా తొలి రెండు సెట్లు గెలిచాడు. అయితే, కోర్టులో వేడి గాలులు, ఎండ తీవ్రత కారణంగా సిన్నర్ తీవ్రంగా అలసిపోయాడు. అప్పటికే చెమటలు కక్కుతూ చాలా ఇబ్బందిపడ్డాడు. అయినప్పటికీ మూడో సెట్‌లోనూ హవా చాటుతూ 5-1తో ఆధిక్యంలో నిలిచాడు. మరో పాయింట్ సాధిస్తే సిన్నర్ గెలిచినట్టే. కానీ, తీవ్రంగా అలసటకు గురైన సిన్నర్ మెడికల్ బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత అతను జోరు తగ్గిపోయింది. స్వేచ్ఛగా కదలడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. పదే పదే మోకాళ్లు పట్టుకుంటూ కనిపించాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అర్జెంటీనా ప్లేయర్ సెరుండోలో పుంజుకున్నాడు. డ్రాప్ షాట్స్‌తో కోర్టు మూలలు లక్ష్యంగా బంతిని బాది సిన్నర్‌ను మరింత అలిసిపోయేలా చేశాడు. మూడో సెట్‌లో 5-1తో వెనుకబడిన సెరుండోలో వరుసగా ఆరు గేములు నెగ్గి ఆ సెట్ గెలిచాడు. అనంతరం 4, 5వ సెట్లు కూడా నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సిన్నర్ నిష్ర్కమణతో టైటిల్ వేటలో జకోవిచ్‌కు మార్గం సుగమమైంది. మరో స్టార్ ప్లేయర్ అల్కరాజ్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడానికి జకోకు ఇదే చక్కటి అవకాశం.
మూడో రౌండ్‌కు సబలెంక, గాఫ్
ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1 క్రీడాకారిణి సబలెంక హవా కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ ఎల్సా జాక్వెమోట్‌తో తలపడిన సబలెకం 7-5, 6-2 తేడాతో అలవోకగానే నెగ్గింది. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్, అమెరికా స్టార్ కోకో గాఫ్ కూడా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో ఆమె ఈజిఫ్ట్ క్రీడాకారిణి మయార్ షెరిఫ్‌ను 6-3, 6-2 తేడాతో ఓడించింది.






