ISSF World Cup : అదరగొట్టిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్.. వరల్డ్ కప్‌లో స్వర్ణం

by Harish |

ISSF World Cup : అదరగొట్టిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్.. వరల్డ్ కప్‌లో స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. జర్మనీలోని మునిచ్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో బంగారు పతకం దక్కించుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె సత్తాచాటింది. బుధవారం క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇషా 587 స్కోరు చేసి 5వ స్థానంలో నిలిచింది. ఇక ఫైనల్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 43 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ గెలిచింది. ఫైనల్ ఆరంభం నుంచి ఇషా ఇతర షూటర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఏ దశలోనూ ఆమె వెనుకబడలేదు. దీంతో స్వర్ణం సాధించడమే కాకుండా ఇషా వరల్డ్ రికార్డు కూడా సృష్టించింది. గతంలో సౌత్ కొరియా షూటర్ కిమ్ యె జి(42) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును ఆమె బద్దలుకొట్టింది. జర్మనీకి చెందిన వెన్నెకాంప్ డోరీన్(38) రజతం, బల్గేరియా షూటర్ మించెవా మిరోస్లావా(31) కాంస్యం సాధించారు. ఇషాకు ఇది రెండో వరల్డ్ కప్ గోల్డ్ మెడల్. గతేడాది చైనాలో జరిగిన ప్రపంచకప్‌లో తొలి స్వర్ణాన్ని గెలిచింది. మరోవైపు, ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ మను భాకర్ నిరాశపర్చింది. ఫైనల్‌కు కూడా అర్హత సాధించకపోవడం గమనార్హం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 582 స్కోరు చేసి 12వ స్థానంతో సరిపెట్టింది. మరో భారత షూటర్ సర్నోబత్ రాహి(581) 14వ స్థానంలో నిలిచింది. టాప్-8 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.


Next Story