భారత్‌లో క్రికెట్‌ అంటే పిచ్చి అని ఇందుకే అంటారేమో.. స్పోర్ట్స్ కవరేజీలో క్రికెట్‌ వాటా ఎంతో తెలుసా?

by Harish |   (  Updated:2025-07-17 14:25:23  IST  )

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

భారత్‌లో క్రికెట్‌ అంటే పిచ్చి అని ఇందుకే అంటారేమో.. స్పోర్ట్స్ కవరేజీలో క్రికెట్‌ వాటా ఎంతో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. హవాస్ ప్లే నివేదిక ప్రకారం.. గతేడాది ఇండియాలో క్రీడా అభిమానులు ఎక్కువగా చూసింది క్రికెట్‌నే. స్పోర్ట్స్ కవరేజీలో జెంటిల్మెన్ గేమ్‌దే అగ్రపీఠం. 86 శాతం వ్యూయర్‌షిప్ సాధించింది. మిగతా ఆటలు క్రికెట్‌కు దరిదాపుల్లో కూడా లేవు. క్రికెట్ మినహా మిగతా అన్ని క్రీడలు కలిపి కేవలం 14 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024లో ఐపీఎల్‌‌ను 857 మిలియన్ల మంది వీక్షించారు. అందులో టెలివిజన్‌లో 464 మిలియన్ల మంది, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 393 మిలియన్ల మంది చూశారు. రెండో స్థానంలో ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) నిలిచింది. గతేడాది పీకేఎల్‌కు 350 మిలియన్ల వ్యూయర్‌షిప్ దక్కింది. భారత ఫుట్‌బాల్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ 232 మిలియన్లతో మూడో స్థానంలో ఉంది. ఇక, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 130 మిలియన్లతో తర్వాతి స్థానంలో ఉంది. టీవీలో 110 మిలియన్లు, ఓటీటీలో 20 మిలియన్లు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన యూరోప్ ఫుట్‌బాల్ లీగ్స్ యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్‌(యూసీఎల్), ప్రీమియర్ లీగ్‌(ఈపీఎల్)లను డబ్ల్యూపీఎల్ వెనక్కినెట్టింది. భారత్‌లో యూసీఎల్‌‌ను 125 మిలియన్ల‌ మంది వీక్షించగా.. ఈపీఎల్‌ను 96 మిలియన్ల మందే చూశారు. ఇతర టోర్నీలు 82 మిలియన్ల వ్యూయర్‌షిప్ పొందాయి.

ఐపీఎల్ 2025 అతిపెద్ద సీజన్

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ గణాంకాలు మిగతా సీజన్ల రికార్డులను బద్దలుకొట్టాయి. సీజన్ మొత్తం వాచ్ టైం 840 బిలియన్ మినిట్స్‌గా నమోదైంది. భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం లీగ్‌పై చూపలేదు. టీవీలో 169 మిలియన్ల మంది వీక్షించినట్టు జియో స్టార్ తెలిపింది. జియో‌హాట్‌స్టార్‌లో 892 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన ఫైనల్‌కు 31.7 బిలియన్ల మినిట్స్ వాచ్ టైం వచ్చింది.

Next Story