IPL 2026 : ఆ ఆటగాడిపై కన్నేసిన సీఎస్కే.. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?

by Harish |

వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌కు సంబంధించి రోజుకో వార్త బయటకొస్తోంది.

IPL 2026 : ఆ ఆటగాడిపై కన్నేసిన సీఎస్కే.. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌కు సంబంధించి రోజుకో వార్త బయటకొస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టు మారబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా సుందర్‌ను సీఎస్కే తీసుకుంటున్నట్టు ఆ వార్తల సారాంశం. అయితే, ఇది ప్రచారం మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. కానీ, మాజీ క్రికెటర్ కె.విశ్నేశ్ మాత్రం అది రూమర్ కాదంటున్నాడు. తాజాగా మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో విఘ్నేశ్ ఈ విషయంపై మాట్లాడాడు.

సుందర్ సీఎస్కేలోకి వెళ్లడం ఖాయమైందని, తనకు కచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించాడు. గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను ఎలాగైతే తీసుకుందే అదే తరహాలో సుందర్ డీల్ కూడా జరుగుతుందని చెప్పాడు. ‘ఈ వార్త అత్యంత రహస్యం. ఖరారైంది. బ్లూ జెర్సీ ఎల్లో జెర్సీగా మారబోతోంది. ‘అది కేవలం పుకారు.మీకెలా తెలుసు’అని నన్ను అడగొచ్చు. నాకు సమాచారం అందింది. గుజరాత్ ఫ్రాంచైజీలో ఓ వ్యక్తి నాకు తెలుసు.సుందర్ సీఎస్కేలోకి వెళ్లడం కన్ఫర్మ్. ముంబైకి పాండ్యాను ఎలాగైతే క్యాష్ డీల్ ద్వారా ఇచ్చారో సుందర్‌ డీల్ కూడా అలాగే జరగనుంది.’అని విఘ్నేష్ తెలిపాడు.

ఈ సీజన్‌కు ముందు వేలంలో గుజరాత్ సుందర్‌‌ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అంతే ధరకు సీఎస్కే క్యాష్ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్టు విఘ్నేశ్ చెప్పాడు . ఈ ఏడాది కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన సుందర్ 133 రన్స్ చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 66 గేములు ఆడిన అతను 39 వికెట్లు పడగొట్టాడు. డిసెంబర్‌లో వేలం జరగనుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్లపై ఓ అంచనాకు వచ్చే ఉంటాయి. సీఎస్కే లేదా జీటీ స్పష్టత ఇస్తేనే సుందర్ డీల్‌పై క్లారిటీ వస్తుంది. సుందర్ చేరిక చెన్నయ్‌కు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ సామర్థ్యం ఈ స్పిన్ ఆల్‌రౌండర్ సీఎస్కే‌‌కు అదనపు బలమవుతాడని చెబుతున్నారు. లోయర్ ఆర్డర్‌లో కీలకమవుతాడని అంటున్నారు.


Next Story